Chandur | చండూరు జనవరి 21: నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మున్సిపాలిటీలో కరపత్రాల వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. రాత్రికి రాత్రే రోడ్లపై వెలసిన ఈ కరపత్రాలు అధికార కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలను, ఆధిపత్య పోరును బట్టబయలు చేశాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
చండూరు మున్సిపాలిటీ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తులు ఆకస్మికంగా కరపత్రాలను వెదజల్లారు. అధికార పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ కోడి గిరిబాబు కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ కరపత్రాలను ముద్రించారు. గిరిబాబు కుటుంబం అరాచకాలకు పాల్పడుతోందంటూ అందులో తీవ్ర ఆరోపణలు చేశారు. తెల్లవారేసరికి ఊరంతా ఈ కరపత్రాలు కనిపించడంతో స్థానికంగా ఇది చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. చండూరులోని ప్రధాన కూడళ్లలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక కారులో కొందరు వ్యక్తులు ఈ కరపత్రాలను విసిరినట్లు గుర్తించారు. టెక్నాలజీ ఆధారంగా కారు నెంబర్ను ట్రేస్ చేసిన పోలీసులు, కారు యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేసి పోలీసులు ఒక మాజీ ప్రజాప్రతినిధిని అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఈ కరపత్రాల వ్యవహారం వెనుక చండూరు కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్న ఆధిపత్య పోరే కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మున్సిపాలిటీలో “నా మాటే నెగ్గాలి.. నాదే పైచేయిగా ఉండాలి” అంటూ నాయకుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. పార్టీ అగ్ర నాయకత్వం (హైకమాండ్) దృష్టిలో పడేందుకు, టికెట్ల విషయంలో లేదా పదవుల విషయంలో ఒకరినొకరు దెబ్బతీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.
ముఖ్యంగా సొంత పార్టీ నాయకుడిపైనే ఇలా కరపత్రాలు వేయడం వెనుక, పార్టీలోని కార్యకర్తలలో అసహనం వ్యక్తమవుతున్నాయి. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉంటే సొంత పార్టీ నాయకులు కార్యకర్తలు ఓడగొడతారని భయంతో ఈసారి బరిలో ఉండటానికి అభ్యర్థులు వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తుంది.తాజా ఘటనతో చండూరులో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎలక్షన్ల వేళ మనుగోడు ఎమ్మెల్యే కి ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది.పోలీసులు విచారణ పూర్తి చేస్తే గానీ అసలు సూత్రధారులు ఎవరన్నది బయటపడే అవకాశం ఉంది.