నల్లగొండ, సెప్టెంబర్ 19 : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిందని బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శుక్రవారం పీఏపల్లి మండలం తిరుమలగిరి, గుడిపల్లి మండలంలోని జి.భీమనపల్లి గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వారందరికీ రవీంద్ర కుమార్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో ప్రవేశపెట్టిన అనేక ప్రజా సంక్షేమ పథకాలు యావత్ దేశానికి దిక్సూచిగా మారినట్లు తెలిపారు. కేసీఆర్ తోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని పునరుద్ఘాటించారు.
బీఆర్ఎస్ లో చేరిన ఒక్కరికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక సభ్యత్వం పొంది మృతిచెందిన కార్యకర్త కుటుంబానికి రూ.2 లక్షలు అందజేస్తున్నట్లు తెలిపారు. సభ్యత్వాల నమోదులో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఉందని వెల్లడించారు. బీఆర్ఎస్ పాలనలో గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారిపోయాయన్నారు. ప్రతీ గ్రామంలో పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామం, డంపింగ్ యార్డు, రైతు వేదికలను కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిందని తెలిపారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం అధిక మొత్తంలో నిధులు మంజూరు చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేసీఆర్ దూరదృష్టి ఫలితంగా గ్రామాల్లో అడుగంటిన చెరువులన్నీ ప్రస్తుతం జలకళతో దర్శనమిస్తున్నట్లు తెలిపారు. అనేక మారుమూల గ్రామాల్లోనూ ఇంటింటికీ మిషన్ భగీరథ పథకం ద్వారా స్వచ్ఛమైన తాగు నీరు అందుతుందని చెప్పారు.
రైతులకు సాయం చేయాలనే ధృఢ సంకల్పంతో రైతు బంధు, రైతు బీమా వంటి చారిత్రాత్మక పథకాలను కేసీఆర్ రూపకల్పన చేశారన్నారు. ఈ రెండు పథకాలు దేశానికే దిక్సూచిగా మారాయన్నారు. పేదింటి ఆడపిల్లల పెండ్లి కోసం కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల ద్వారా రూ.1,00,116 మేనమామ కట్నంగా కేసీఆర్ సర్కార్ అందజేసిందని చెప్పారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు, బీడీ కార్మికులకు ప్రభుత్వం పెన్షన్ అందజేసిందన్నారు. దేవరకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ఇతర పార్టీల నుంచి కూడా బీఆర్ఎస్ లోకి భారీగా వలసలు ఉంటాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.