నిర్మల్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. ఎన్నికలకు ముందు అలవికాని హామీలిచ్చి అందలమెక్కిన తర్వాత సబ్బండ వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతులను నట్టేట ముంచింది. ఒకవైపు యూరియా కష్టాలు, మరోవైపు పంట పెట్టుబడి సాయం అందకపోవడంతో రైతులు కష్టాల సాగును కొనసాగిస్తున్నారు. అటు బ్యాంకులు సహకరించక పోతుండడం, ఇటు ప్రభుత్వం కనికరించకపోవడంతో వారంతా మళ్లీ ప్రైవేటు అప్పుల బాట పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పులు తీసుకొని సాగు చేస్తున్నారు. వీరంతా గత సీఎం కేసీఆర్‌ను దేవుడిలా అభివర్ణిస్తూ తమ సాగుకు ఆర్థిక సాయం చేసి ఆదుకున్నాడని గుర్తు చేసుకుంటున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్లపాటు ప్రతి సీజన్‌కు ముందే పెట్టుబడి సాయం అందించి అప్పుల ఊబిలో కూరుకుపోయిన అన్నదాతలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు పేరును రైతుభరోసా అని మార్చిందే గాని, అమలు చేయడంలో మాత్రం కుంటి సాకులు వెతుకుతున్నది. అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం ఎకరాకు ఏడాదికి రూ.10 వేలు ఇవ్వగా, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎకరాకు రూ.15వేలు ఇస్తామని హామీ ఇచ్చి, అమలులోకి వచ్చే సరికి రూ.12 వేలుగా నిర్ణయించింది. అయితే దానిని కూడా అమలు చేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నది.
ప్రస్తుత యాసంగి సీజన్ ప్రారంభమై దాదాపు మూడు నెలలు కావస్తున్నా నేటికీ రైతుభరోసా అందకపోవడంతో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 1,88,597 మంది రైతులు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. వీరికి పెట్టుబడి సాయం కింద రూ.268.85 కోట్లు విడుదల చేయాలి. మున్సిపల్ ఎన్నికలు ముగియగానే రైతు భరోసా అందజేస్తామని కొన్ని రోజులుగా ప్రభుత్వ పెద్దల నుంచి ప్రకటనలు వస్తున్నాయే తప్ప అవి ఆచరణకు నోచుకోవడం లేదు. ఎన్నికలు ముగిసి వారం రోజులవుతున్నా ప్రభుత్వం రైతు భరోసా ఊసెత్తడం లేదు. త్వరలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో రైతుభరోసా నిధుల విడుదలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ప్రాదేశిక ఎన్నికల కోడ్‌ను బూచిగా చూపి ఈ యాసంగి సీజన్ భరోసా డబ్బులు ఎగవేసేందుకు ప్రభుత్వం యత్నిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుత యాసంగి సీజన్లో నిర్మల్ జిల్లా వ్యాప్తంగా రైతులు దాదాపు 3 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. అధికారుల నివేదిక ప్రకారం 1.10 లక్షల ఎకరాల్లో వరి, 1.02 లక్షల ఎకరాల్లో మక్క, 35 వేల ఎకరాల్లో జొన్న, 55 వేల ఎకరాల్లో శనగ సాగు చేసినట్లు చెబుతున్నారు. ఆయా పంటల సాగు కోసం అవసరమైన పెట్టుబడి ఖర్చులను ప్రభుత్వం ఇవ్వకపోవడంతో చాలా మంది రైతులు అప్పులు చేసి సాగు చేస్తున్నారు. రైతు భరోసా డబ్బులు అందితే చేసిన అప్పులు తీర్చవచ్చనే ఆలోచనతో రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ యాసంగికి రైతు భరోసా డబ్బులను ఇస్తామని ప్రకటనలు చేస్తున్నారే తప్ప ప్రభుత్వ పెద్దల నుంచి ఎలాంటి స్పష్టత లేకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి రెండు సీజన్లలో ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేసింది.
అలాగే గత వానకాలం సీజన్లో అనేక ఆంక్షలు అమలు చేసి అరకొర సాయాన్ని అందజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రైతు భరోసా అమలు కోసం కొత్త నిబంధనలు రూపొందించాలని, అర్హులకే ఇవ్వాలని, గతంలో అవకతవకలు జరిగాయంటూ వట్టి మాటలు చెప్పి రైతులను మభ్యపెట్టేందుకు పాలకులు యత్నిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల వ్యవసాయ మంత్రి ఏ భూములు సాగయ్యాయో తెలుసుకునేందుకు శాటిలైట్ ద్వారా పరిశీలించిన తర్వాతనే రైతు భరోసా సాయాన్ని అందిస్తామని ప్రకటించారు.
ఈ మేరకు సాగు భూములను సర్వే చేసిన అధికారులు ఎందరికి కోత పెడతారోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. చేతిలో పెట్టుబడి సాయం లేకపోవడంతో రైతులు వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి సాగు చేస్తున్నారు. ఇప్పటికైనా రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా కింద పంట పెట్టుబడి సాయాన్ని అందించి ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

