AP News : తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే అలిపిరి నడకమార్గంలో ఓ భక్తుడు ధూమపానం చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఈ చర్యను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తీవ్రంగా పరిగణించింది. నిబంధనలను ఉల్లంఘించిన సదరు భక్తుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసి కఠిన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టంచేసింది. అంతేగాక తనిఖీల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సెక్యూరిటీ సిబ్బందిపై కూడా క్రమశిక్షణా చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.
వివరాల్లోకి వెళ్తే.. అలిపిరి మెట్ల మార్గంలో ఓ వ్యక్తి ధూమపానం చేస్తున్న విషయం టీటీడీ దృష్టికి వచ్చింది. తిరుమల క్షేత్ర పవిత్రతను కాపాడేందుకు ఇక్కడ మద్యపానం, ధూమపానం, మాంసాహారం, మత్తుపదార్థాల వినియోగంపై పూర్తి నిషేధం అమలులో ఉంది. ఈ నిబంధనలు అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలతోపాటు టీటీడీ పరిధిలోని అన్ని ప్రాంతాలకు వర్తిస్తాయి. ఈ విషయం తెలిసినప్పటికీ సదరు వ్యక్తి నిబంధనలను అతిక్రమించి పవిత్రమైన నడకమార్గంలో ధూమపానం చేయడం హేయమైన చర్య అని టీటీడీ వ్యాఖ్యానించింది.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరిస్తామని టీటీడీ హెచ్చరించింది. క్షేత్ర పవిత్రతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, భక్తులందరూ టీటీడీ నిబంధనలను తప్పనిసరిగా పాటించి సహకరించాలని విజ్ఞప్తి చేసింది. ప్రవేశ మార్గాల వద్ద తనిఖీలను మరింత కట్టుదిట్టం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.