సూర్యాపేట, మార్చి 4 (నమస్తే తెలంగాణ) : జిల్లా కేంద్రమైన సూర్యాపేట పట్టణంలో గత రెండు మూడు రోజులుగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ దాష్టీకాలు పెరిగిపోతున్నాయి. వరుస దాడులతో రెండు రోజుల వ్యవధిలో నాలుగు సంఘటనలు జరిగాయి 9వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు గండగాని నాగభూషణం, సంకటి లింగరాజు, బత్తుల జానీతో పాటు నీలాల లక్ష్మయ్యపై కాంగ్రెస్ నాయకులు దాడులకు తెగబడ్డారు. దీంతో లక్ష్మయ్యకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానకు తరలించారు. కాంగ్రెస్ పార్టీ దాడులకు తెగబడితే చూస్తూ సహించేది లేదని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అరాచక శక్తులను ప్రోత్సహించడం సరికాదన్నారు.
రెండేళ్ల పాలనలో అరాచకాలు తప్ప అభివృద్ధి శూన్యం అన్నారు. అనవసరంగా గొడవలు సృష్టిస్తూ బీఆర్ఎస్ నాయకులపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. తక్షణమే పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. మూడు రోజుల క్రితం 24,26వ వార్డుల్లో రెండు రోజుల క్రితం 9వ వార్డులో ఇలా వరుస దాడులకు పాల్పడటం సరికాదన్నారు. 9వ వార్డులో నాగభూషణం ఇంటిపై దాడి చేయగా ఆయన కుమారుడు గాయపడ్డాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసి వెళుతుండగా ఫిర్యాదు చేసిన నీలాల లక్ష్మయ్య అనే వ్యక్తిపై దారికాచి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నారన్నారు. అలాగే 26వ వార్డులో సంకటి లింగరాజు, 24వ వార్డులో బత్తుల జానీపై గొడ్డలితో దాడికి యత్నించగా తప్పించుకున్నారన్నారు. వీటికి తోడు 40వ వార్డులో మాజీ కౌన్సిలర్ తాహేర్ ఇంటి ఎదుట ఉన్న బైక్‌ను ధ్వంసం చేశారన్నారు.
స్థానిక మంత్రులు, తమ పార్టీ నాయకులపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని లింగయ్య యాదవ్ సూచించారు. పోలీసులు సరైన విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, దాడులు ఆపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, ఉప్పల ఆనంద్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మాజీ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం, మాజీ జడ్పీటీసీ జీడి భిక్షం, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు సవరాల సత్యనారాయణ, బూర బాలసైదులుగౌడ్, మాజీ కౌన్సిలర్లు తాహేర్ పాషా, బత్తుల జానీ, మాజీ సర్పంచ్ శ్యామ్ అమరవాది శ్రవణ్ తదితరులు ఉన్నారు. కాగా గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్న నీలాల లక్ష్మయ్యను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్ పరామర్శించారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆదేశాలతో వెళ్లి పరామర్శించానని ప్రస్తుతం లక్ష్మయ్య కోమాలో ఉన్నాడని, ప్రాణభయమైతే లేదని వైద్యులు చెప్పారన్నారు.