నకిరేకల్, మార్చి 31: మహిళా సంఘాలకు స్త్రీ నిధి ద్వారా వడ్డీ లేని రుణాలు వెంటనే అందించాలని ఐద్వా నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షురాలు చెన్నబోయిన నాగమణి, జిల్లా కమిటీ సభ్యురాలు బహురోజు ఇందిరా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నకిరేకల్ పట్టణంలోని చీమల గడ్డ ప్రాంతంలో ఐద్వా ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తామని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు వాటిని విస్మరించడం శోచనీయమన్నారు. మహిళలు తమ హక్కుల సాధన కోసం సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. మహిళా సమస్యల పరిష్కారంలో ఐద్వా ముందుండి పోరాడుతుందని పేర్కొన్నారు.
స్త్రీ నిధి రుణాలు వడ్డీ లేకుండా ఇస్తామని ప్రకటించినప్పటికీ అమలులో అధిక రుసుములు, షరతులు విధిస్తున్నారని విమర్శించారు. ఒక సంఘం సభ్యురాలు వాయిదా చెల్లించకపోయినా ఇతర సంఘాలకు రుణాలు నిలిపివేయడం సరికాదన్నారు. పురుషులతో పాటు మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని, మహిళల హక్కులు పరిరక్షించాలంటే ఐద్వా సభ్యత్వంలో చేరి సంఘటితంగా పోరాడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆ సంఘం ప్రతినిధులు పద్మ, కళ్యాణి, శ్రావణి, మరియమ్మ, కమిని, అనూష, ముత్తమ్మ, ప్రజా సంఘాల నాయకులు వి.కృష్ణ, నర్సింహ, తాజేశ్వర్ పాల్గొన్నారు.