నల్లగొండ, మార్చి 24 : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం సీపీఎం పట్టణ పేదల సంఘం ఆధ్వర్యంలో నల్లగొండ ఆర్డీఓ కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రజలకు 6 గ్యారంటీల పేరుతో పథకాలు వాగ్దానం చేసి అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా రూ.12 వేలు ఇస్తామని వాగ్దానం చేసి గ్రామీణ ప్రాంతాల్లో అనేక కొర్రీలు పెట్టి ఇవ్వడం లేదని ఆరోపించారు. భూమిలేని పేదలు పట్టణాల్లో ఉంటే పేదలు కారా అని ఆయన ప్రశ్నించారు. పట్టణ పేదలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేస్తూ ఏడాదికి రూ.12 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో భూములు లేక ఉపాధి కరువై పట్టణ ప్రాంతాలకు వలసలు వచ్చి అడ్డా కూలీలుగా జీవనోపాధి పొందుతున్న పేదలకు ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేసి జీవనోపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
సీపీఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా నల్లగొండ పట్టణంలో సీపీఎం పలు బృందాలుగా వార్డుల్లో సర్వే చేసిన సందర్భంలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అనేక సంవత్సరాలుగా కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు చేసుకొని ఎదురుచూస్తున్నారని కొత్త పెన్షన్లు వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేశారు. అర్హులైన పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, లాటరీ ద్వారా ఎంపికైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు పట్టా సర్టిఫికెట్లు ఇచ్చి స్వాధీన పరచాలని డిమాండ్ చేశారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సయ్యద్ హాశం మాట్లాడుతూ.. నల్లగొండ పట్టణంలో విలీన పంచాయతీల్లో, అలాగే పానగల్లు పెద్దబండ ప్రాంతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం లేదని, వార్డు కార్యాలయాలకు వెళ్లడానికి లింకు రోడ్లు లేవని, నేటికీ కొన్ని ప్రాంతాలకు మంచినీటి సౌకర్యం లేకపోవడం దురదృష్టకరమన్నారు. పట్టణంలో కతాలగూడెం, పెద్దబండ, పానగల్లు, చర్లపల్లి తదితర స్మశాన వాటికలకు ప్రహరీ లేక ఆక్రమణలకు గురవుతున్నట్లు చెప్పారు. వాటికి వెంటనే ప్రహరీలు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయ సూపరింటెండెంట్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు.
పట్టణ పేదల సంఘం కన్వీనర్ దండంపల్లి సత్తయ్య అధ్యక్షతన జరిగిన ధర్నాలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం, పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ, కుంభం కృష్ణారెడ్డి, అద్దంకి నరసింహ, దండెంపల్లి సరోజ, మైల యాదయ్య, కోట్ల అశోక్ రెడ్డి, గాదె నరసింహ, భూతం అరుణ, ఊట్కూరు మధుసూదన్ రెడ్డి, ఆకిటి లింగమ్మ, పట్టణ పేదల సంఘం కమిటీ సభ్యులు మిరియాల శ్రీవాణి ,సునీత, యల్లమ్మ, నాగరాజు, శ్రీను కుమార్, నరసమ్మ, లక్ష్మమ్మ, వెంకటయ్య పాల్గొన్నారు.
CPM : ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ సర్కార్ విఫలం : ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి