నల్లగొండ ప్రతినిధి, మే 10 (నమస్తేతెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయతలపెట్టిన సంక్షేమ పథకాల్లో ఎంత వీలైతే అంత కోతలు వేసేందుకు కొర్రీల మీద కొర్రీలు పెడుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏ పథకాన్ని పరిశీలించినా ఏదో విధంగా లబ్ధిదారుల సంఖ్యను సాధ్యమైనంత మేర కుదించి ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గించుకునేలా కుట్రలు చేస్తుందన్న అనుమానాలు నెలకొన్నాయి. అర్హులందరికీ పథకాలు ఇస్తామంటూనే నిబంధనల పేరిట అడ్డగోలు కొర్రీలు పెడుతుంది. మెజారిటీ పథకాలకు ఏదో ఒక మెలిక పెట్టి లబ్ధిదారులను తగ్గిస్తుంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఉచిత కరెంటు, సబ్సిడీ గ్యాస్‌లో అనేక కొర్రీలతో లబ్ధిదారుల సంఖ్య పెరుగకుండా జాగ్రత్తలు పడుతుంది. తాజాగా నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పిస్తామని చెప్పి రాజీవ్ యువ వికాసం పేరిట అమలు చేస్తున్న పథకంలో కఠిన నిబంధనలు పెట్టింది. 50వేల రూపాయల నుంచి రూ.4లక్షల వరకు సబ్సిడీపై రుణాలు ఇస్తామని చెబితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వేల సంఖ్యలో యువత దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల ప్రక్రియ ముగిశాక సిబిల్ సోర్ ఉన్న వారికి రుణాలు ఇస్తామని కొత్త మెలిక పెట్టడంతో యువత ఖంగుతిన్నారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట తెచ్చిన మరో పథకంలోనూ ఇదే పరిస్థితి. వ్యవసాయ కూలీలకు ప్రతి ఆరు నెలలకోసారి రూ.6వేల చొప్పున ఏడాదికి 12వేల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. ఇందులో ఉపాధి హామీ కార్డు ఉండి ఏడాదికి కనీసం 20 రోజులు పని చేసి ఉండాలనే నిబంధన పెట్టింది. దీంతోపాటు లబ్ధిదారుడికి గుంట భూమి కూడా అతని పేరు మీద ఉండవద్దని మరో మెలిక పెట్టింది. దీంతో ఒక గ్రామంలో పదుల సంఖ్యలో ఉన్న వ్యవసాయ కూలీలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు దూరమయ్యారు. ప్రభుత్వం ఎంపిక చేసిన పైలెట్ గ్రామాల్లో సైతం 10 నుంచి 20 మందికి ఎకడా లబ్ధిదారుల సంఖ్య మించకపోవడం గమనార్హం. రేషన్ కార్డు కూడా భూమితో లింకు పెట్టారు. కొత్త రేషన్ కార్డు కావాలంటే ముందుగా పాత రేషన్ కార్డులో పేరు తొలిగించుకోవాల్సిందేనని షరతు పెట్టగా చాలా మంది మీ సేవలో దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారు. కానీ.. ఇందులో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇక రైతు భరోసా విషయంలోనూ ప్రభుత్వం సాగు చేస్తున్న వారికే భరోసా అంటూ తొలుత మెలిక పెట్టింది. తర్వాత వెనక్కి తగ్గినా నేటికీ నాలుగు ఎకరాలకు మించి యాసంగి రైతు భరోసా డబ్బులు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి సీజన్లో రూ.7500 చొప్పున రైతు భరోసాగా అందిస్తామని ప్రకటించి ప్రస్తుతం దాన్ని 6వేల రూపాయలకే కుదించిన విషయం తెలిసిందే. 6వేల రూపాయలు సైతం యాసంగి సీజన్ ముగిసినా ఖాతాల్లో పడకపోవడంతో ప్రభుత్వంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆరు గ్యారంటీల్లో భాగంగా అమలు చేస్తున్న కొన్ని పథకాల్లోనూ ప్రభుత్వం ఇవే కొర్రీలు పెడుతుంది. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రధానమైన హామీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇండ్లకు కూడా మెలిక పెట్టింది. జనవరి 26న లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ చేసిన ప్రభుత్వం.. మండలానికి ఓ గ్రామాన్ని పైలెట్‌గా ఎంపిక చేసింది. గ్రామాల్లో అందరికీ ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని భావించిన ప్రజలకు నిరాశే మిగిలింది. ఇందిరమ్మ కమిటీల్లో కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడంతో వారు ఎంపిక చేసిన వారే లబ్ధిదారులు అయ్యారు. ఈ రకంగా దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన కొందరిపై వేటుపడగా మిగిలిన వారు ఇల్లు నిర్మించుకునే క్రమంలో పెట్టిన నిబంధనలు కూడా ఇబ్బందికరంగా మారా యి. ఇండ్లు మంజూరు చేసే ప్రొసీడింగ్స్‌లో ఎకడా కొలతలు మెన్షన్ చేయకపోవడంతో లబ్ధిదారులు తమకు తోచిన విధంగా మారింగ్ చేసుకొని బేస్మెంట్లు మొదలుపెట్టారు. తీరా 400 చదరపు లడుగుల నుంచి 600 చదరపు అడుగుల్లో నిర్మించే ఇండ్లకు మాత్రమే బిల్లులు చెల్లిస్తామని ప్రభుత్వం తేల్చింది. దీనివల్ల ఇప్పటికే లబ్ధిదారుల్లో కొందరు 600 చదరపు అడుగులకు పైగా ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టిన వారికి బిల్లులు ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో లబ్ధిదారులు ఇప్పటికే కట్టిన బేస్మెంట్లు కూల్చలేక, నిబంధన ప్రకారం ఇల్లు కట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శిథిలమైన ఇండ్లు ఉన్న కొందరు పకన ఇల్లు కట్టుకునేందుకు ప్రయత్నించినా అధికారులు ఒప్పుకోవడం లేదు. ఉన్న ఇంటిని కూల్చి కొత్తగా కడితేనే బిల్లులు వస్తాయని లబ్ధిదారుల ముఖం మీదనే చెప్పేస్తున్నారు. ఇలాంటి అర్ధంపర్ధం లేని నిబంధనలతో ప్రజలు విసిగిపోతున్నారు.
గత ప్రభుత్వ హయాంలో రుణాలు తీసుకున్న వారు, రుణాలు తీసుకొని వివిధ కారణాలతో చెల్లించని వారు అనర్హులని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పకనే చెప్తోంది. సిబిల్ సోర్ ఉంటేనే రుణాలు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. బ్యాంకుల్లో రుణాలు తీసుకుని సక్రమంగా చెల్లించే వారికి మాత్రమే సిబిల్ సోర్ బాగుంటుంది. కానీ.. రుణాలే తీసుకొని వారి పరిస్థితి ఏంటి అనేది ప్రభుత్వం ఆలోచించడం లేదు. వివిధ కార్పొరేషన్ల ద్వారా నల్లగొండ జిల్లాలో వేలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం మండల స్థాయిలో దరఖాస్తుల పరిశీలన కొనసాగుతుండగా.. వచ్చే నెల రెండో తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం వచ్చిన దరఖాస్తుదారుల్లో చాలామంది నిరుపేదలే ఉన్నారు. వారికి బ్యాంకులతో ఎలాంటి సంబంధాలు లేవు. వారిలో చాలా మందికి పాన్ కార్డులు కూడా లేవని తెలిసింది. ఇలాంటి వారికి సిబిల్ సోర్ ఎకడ నుంచి వస్తుందని ఆశావహులు ప్రశ్నిస్తున్నారు.
నిజానికి ఈ పథకం కింద బ్యాంకులు ఇచ్చేది నామమాత్రమే అయినా.. సిబిల్ సోర్తో లింకు పెట్టడం వల్ల వచ్చిన దరఖాస్తుల్లో 10 శాతం మందికి కూడా రుణాలు అందే పరిస్థితి కనిపించడం లేదు. రాజీవ్ యువ వికాసం పథకం కింద ఇప్పటికే ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించిన అధికారులు ఈ నెల 20వరకు మండల స్థాయిలో పరిశీలన పూర్తి చేసి జిల్లా కమిటీలకు సిఫారసు చేస్తారు. 21నుంచి 31వరకు జిల్లా స్థాయిలో పరిశీలించి మంజూరు పత్రాలు జారీ చేయాలి. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు రుణాల పంపిణీ ప్రారంభించి 9వ తేదీ వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ.. సిబిల్ సోర్ ప్రాతిపదికన ఎంపిక చేస్తే మాత్రం ఈ పథకాలకు ఎవరూ ఎంపికయ్యే పరిస్థితి ఉండదని దరఖాస్తుదారులు వాపోతున్నారు. రూ.50వేల వరకు పూర్తి సబ్సిడీపై రుణం ఇస్తామన్నారు. లక్ష రూపాయల వరకు 80 శాతం, రూ.2లక్షల నుంచి రూ.4లక్షల వరకు 70శాతం సబ్సిడీతో రుణాలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఇందులో బ్యాంకులు ఇచ్చే దానికంటే ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ ఎకువగా ఉంది. కానీ.. లబ్ధిదారులను బ్యాంకర్లు నమ్మాల్సిన అవసరం కనిపిస్తుంది. అందుకే సిబిల్ సోర్ నిబంధన ప్రవేశపెట్టినట్లు తెలుస్తుంది. సిబిల్ సోర్ చూడాలంటే ఒక లబ్ధిదారుడు 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఉందో లేదో తెలియని రుణానికి ఇప్పటికే వందల్లో ఖర్చు చేశామని, ఇది మరో అదనపు ఖర్చు అని దరఖాస్తుదారులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో 10శాతం దరఖాస్తుదారులకు కూడా రుణాలు వచ్చే అవకాశం కనిపించడం లేదని చర్చ జరుగుతుంది. ఏదో విధంగా లబ్ధిదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకే ప్రభుత్వం ఇలాంటి మెలికలు పెడుతుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.