సూర్యాపేట, అక్టోబర్ 09 : స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో పరోక్షంగా మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత 50 సంవత్సరాలుగా బీసీలకు, బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకమన్నారు. కోర్టులో జీఓ 9 నిలబడదని తెలిసి కాంగ్రెస్ ప్రభుత్వం నటించిందన్నారు. ఆర్టికల్ 9 సవరించి పార్లమెంట్లో అనుమతి వస్తే తప్పా ఇది సాధ్యం కాదని బీఆర్ఎస్ మొదటి నుంచి చెబుతూనే ఉందన్నారు.
బీసీ రిజర్వేషన్లు ఇచ్చామని, ఏదో పోరాడమని చెప్పుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నటించిందన్నారు. కోర్టు స్థానిక సంస్థల నోటిఫికేషన్ నిలిపివేసిందని, దీనికి ప్రధాన ముద్దాయి కాంగ్రెస్ అన్నారు. ఆరూ గ్యారంటీల మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ల విషయంలో బీసీల మనోభావాలను, ఆత్మ గౌరవాన్ని అగౌరవ పరిచిందన్నారు. నోటిఫికేషన్ వెలువడడంతో ఎంతో మంది బీసీ అభ్యర్థులు డబ్బులు పోగొట్టుకున్నారని, దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. బీఆర్ఎస్ మొదటి నుంచి చెబుతున్నట్లుగానే 42 శాతం రిజర్వేషన్ల సాధనకు పోరాడుతుందన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు.