వారంతా నిరుపేదలు. రెక్కాడితే గానీ డొక్కాడని అభాగ్యులు. ఏ పూటకాపుట వెళ్లదీసుకునే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు. వాళ్ల దుస్థితిని పరిశీలించిన నాటి ప్రభుత్వాలు అరకొర భూములు పంచి ఆ కుటుంబాలకు గూడు కట్టించాయి. వారంతా దశాబ్దాలుగా వాటి నీడనే ప్రశాంతంగా కాలం వెళ్ల్లదీస్తున్నారు. కానీ ఉన్నట్టుండి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిరుపేదలపై కక్ష కట్టింది. ఎన్నడూ లేని విధంగా ఇండ్లు, ఇండ్ల స్థలాలపై విరుచుకుపడింది. ఏకంగా నిషేధిత జాబితాలో చేర్చి దెబ్బకొట్టింది.
యాదాద్రి భువనగిరి, జనవరి 21 (నమస్తే తెలంగాణ) : పేదల సంక్షేమమే లక్ష్యమని గొప్పలు చెప్పుకొనే కాంగ్రెస్ ప్రభుత్వం వారిపైనే తన ప్రతాపాన్ని చూపిస్తున్నది. ఏండ్లుగా ఎలాంటి రంది లేకుండా నివసిస్తున్న వారిపై దాష్టీకం ప్రదర్శిస్తున్నది. ఏకంగా వేలాది ఇండ్లను నిషేధిత జాబితాలో చేరుస్తున్నది. ప్లాట్ల ను సైతం పీవోబీలో చేరుస్తున్నది. ఇంతటితో ఆగకుండా ఏకంగా ప్రైవేట్ భూములను కూడా నిషేధిత జాబితాలో పెట్టి.. పేదలను ఆగం చేస్తున్నది. దీంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ హయాంలో భూములను కొనుగోలు చేసి పేదలకు ఇండ్ల స్థలాలు, ఇండ్లు కట్టించి పంపిణీ చేశాయి. సుమారు 40 నుంచి 50 ఏండ్ల క్రితం ఈ ప్రక్రియ జరిగింది. అప్పటి నుంచి పేదలు ఇండ్లు కట్టుకొని జీవనం కొనసాగిస్తున్నారు. గ్రామాలు, మున్సిపాలిటీలో ఠంఛనుగా ట్యాక్స్‌లు కడుతున్నారు. కొందరు ఇతర అవసరాలకు అమ్ముకున్నారు. ఇంకొందరు వాటిల్లోనే నివాసం ఉంటున్నారు. అయితే ఇటీవల సర్కారు మాత్రం వివిధ రకాల కారణాలతో భూములన్నింటినీ నిషేధిత జాబితాలో పొందుపరిచింది. ఇందులో భాగంగా జిల్లాలో వేలాది ఇండ్లను, వందల ఎకరాల భూములను పీవోబీలో చేర్చింది. అయితే ఇన్ని రోజులు లేని నిషేధిత జాబితా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీవోబీలో చేర్చడంతో అటు ఇండ్లు అమ్మడం, కొనడం జరగదు. అవసరం ఉన్నోళ్లకు బ్యాం క్ నుంచి రుణాలు రావు. దీంతో లబ్ధిదారులు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. “ఇందుకేనా హస్తం పార్టీని గెలిపిచింది” అని దుమ్మెత్తిపోస్తున్నారు.
జిల్లాలోని మోత్కూరు మండలంలో 2155 ఇండ్లను నిషేధిత జాబితాలో చేర్చారు. ఇం దులో ఒక్క మోత్కూరు మున్సిపాలిటీలోనే 646 ఇండ్లను పీవోబీలో చేర్చారు. మండలంలోని పాటిమట్ల, కొండగడప, పనకబండ, దత్తాయిగూడెం, పాలడుగు, దాచారం, పొడిచేడు, అనాజిపురం తదితర గ్రామాల్లో ఇం డ్లను 22(ఏ)1 కింద పెట్టారు. ఇదే విషయా న్ని లబ్ధిదారులు అధికారులను ప్రశ్నించగా.. తమకేం తెలియదని, రాష్ట్రమంతా ఇలానే ఉందని సమాధానమిస్తున్నారని వారు చెబుతున్నారు. తమను నట్టేట ముంచుతున్న కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నారు.
భూదాన్‌పోచంపల్లి పరిధిలోనూ 644 ఇండ్ల ను పీవోబీలో చేర్చారు. ఇందులో నాడు ప్రభు త్వం పంపిణీ చేసిన భూములతోపాటు, సొం త పట్టా భూములను సైతం నిషేధిత జాబితా లో చేర్చారని స్థానికులు చెబుతున్నారు. పీవోబీలో పెట్టిన వాటిలో 150 వరకు ప్రైవేట్ ఇండ్లు, ప్లాట్లు ఉన్నాయని పేర్కొంటున్నారు. ఇవన్నీ 50 ఏండ్ల క్రితమే కట్టుకున్నామని పేర్కొంటున్నారు. ఇందులో పలువురు ఇతరులకు అమ్ముకున్నారు. వాస్తవానికి ప్రభుత్వం కొని ఇచ్చిన 15 ఏండ్ల తర్వాత ఆస్తి హక్కు వస్తుందని, ఇప్పుడు పీవోబీలో పెట్టడం ఏంటని బాధితులు వాపోతున్నారు.
గత 40 ఏండ్ల కిత్రం ఇండ్లు కట్టించి ఇచ్చారు. అప్పుడు పీవోబీలో ఏం చేర్చలేదు. ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి ట్యాక్స్‌లు కడుతున్నాం. 40 ఏండ్ల త ర్వాత ఇప్పుడు నిషేధిత జాబితాలో ఎలా పెడతా రు..? కనీసం ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకపోవడం ఏంటి..? పీవోబీలో పెడితే ఆస్తి హక్కు గుంజుకున్నట్టే కదా..? అమ్మడానికి, కొనడానికి వీల్లేకుండా చేయడం కరెక్టేనా..? అవసరానికి లోన్లు కూడా తీసుకుని దుస్థితి ఎందుకు..? ఇది సరికాదు.
పోచంపల్లి మున్సిపాలిటీలో ఉన్నపళంగా 644 ఇండ్లు, ప్లాట్లను పీవోబీలో చేర్చారు. అధికారులను అడిగితే ఏం చెప్పడంలేదు. 50 ఏండ్ల నుంచి ఉంటున్న ఇండ్లపై కాంగ్రెస్ సర్కారు నిషేధిత జాబితా పెట్టడం ఎంత వరకు సబబు. పేదల ఇండ్లపై కాంగ్రెస్ ప్రతాపం సరికాదు. వెంటనే నిషేధిత జాబితాలో నుంచి తొలగించాలి. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తం.