నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్12(నమస్తే తెలంగాణ) : ‘మా ఏడో గ్యారంటీ ప్రజాస్వామ్యం’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి గొప్పలు చెప్తున్నారు. కానీ ఆచరణలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్న ఉద్యమాలను, నిరసనలను ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారు. సమస్యలపై ఆయా వర్గాలు రోడ్లపైకి వస్తే అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధమైతే నిర్బంధం ప్రయోగిస్తున్నారు. ‘ఇదేనా ప్రజాస్వామ్య పాలన అంటే? సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పెద్దలు ఆలోచించాలి. ప్రజలు కోరుకున్న ప్రజాపాలన ఇది కాదు. ముమ్మూటికీ ఇది నిర్బంధ పాలనే’నని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇటీవల మిర్యాలగూడలో జరిగిన ఆ పార్టీ జిల్లా మహాసభల్లో విమర్శించారు కూడా.
‘కేసీఆర్ మంజూరు చేసి నిర్మించిన నల్లగొండ మెడికల్ కాలేజీని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. తర్వాత మేము అహర్నిషలు కష్టపడి, అద్భుతమైన ప్లాన్‌తో ఇష్టంగా నిర్మించిన కాలేజీ కాబట్టి ఓ సారి సందర్శించాలనుకున్నం. కానీ పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్రంగా బాధించింది. గడియారం సెంటర్ నుంచి మెడికల్ కాలేజీ వరకు దారి పొడవునా పోలీసులు మోహరించారు. మెడికల్ కాలేజీ ముందు బారికేడ్లు పెట్టారు. కాలేజీ గేట్లకు తాళాలు వేసి సాయుధ పోలీసులను పహారా ఉంచారు. ఎవరూ అటువైపు వెళ్లకుండా బందోబస్తు పెట్టారు. మేమేమైనా గూండాలమా? విఢ్వంసకారులమా? లేదంటే, మెడికల్ కాలేజీ ఏరియా నిషేధిత ప్రాంతమా?’… అంటూ నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఇటీవల ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
దాదాపు అన్ని వర్గాలు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పెద్దలు ఇచ్చిన హామీలను అమలు చేయాలనే ఎక్కువగా పోరాటాలకు దిగుతున్నాయి. అదే ఇప్పుడు ప్రభుత్వ పెద్దలకు ఆగ్రహం తెప్పిస్తున్నది. దాంతో హామీల అమలుపై ఉద్యమాలకు సిద్ధమవుతున్న వారిని ఎక్కడికక్కడ నిర్బంధించి గొంతు నొక్కాలని చూస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఆశ వర్కర్లు, సమగ్ర శిక్షా ఉద్యోగులు, అంగన్వాడీలు, మాజీ సర్పంచ్‌లు ఇలా వివిధ వర్గాలు తమ ఉద్యమాలను కొనసాగిస్తున్నాయి. వాటిని ఉధృతం చేసే క్రమంలో చలో హైదరాబాద్ కార్యక్రమాలకు పిలుపునిస్తే పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధం సాగిస్తున్నారు. గత వారంలో జరిగిన కొన్ని ఘటలను పరిశీలిస్తే ప్రభుత్వం తీరు ఎలా ఉందో అర్ధమవుతుంది.
ఇక జిల్లాలో సీఎంతోపాటు పలు సందర్భాల్లో మంత్రుల పర్యటనల్లోనూ ముందస్తు అరెస్టులకు పాల్పడుతుండడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతున్నది. వాటితోపాటు గతంలో రామన్నపేటలో అదానీ గ్రూప్స్‌కు చెందిన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఏర్పాటుచేసిన ప్రజాభిప్రాయ సేకరణ సమయంలోనూ ప్రభుత్వ తీరు తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఆ రోజు కూడా ఉమ్మడి జిల్లా అంతటా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలతోపాటు ముఖ్య నేతలందరినీ అరెస్టు చేశారు. విపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నేతలను సైతం అదుపులోకి తీసుకున్నారు.
ప్రభుత్వ అధికారిక కార్యక్రమం ఏదైనా సరే విపక్ష నేతలపై ప్రత్యేక నిఘా పెట్టడం సర్వసాధారణంగా మారింది. ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ వంటి పార్టీలు చేస్తున్న పోరాటాలపైనా డేగ కన్ను పెడుతున్నారు. ప్రత్యేక నిఘా వర్గాలతో కదలికపై నిరంతరం కన్నేసి ఉంచుతున్నారు. ప్రజాస్వామ్య పాలన అంటూనే ఇలా చీటికిమాటికి అరెస్టులు, నిర్బంధాలతో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విపక్ష నేతలు మండిపడుతున్నారు. ప్రజాపాలన అంటే నిత్యం ప్రజల గొంతు నొక్కే కుట్రలు చేయడమేనా అని ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యం తమ ఏడో గ్యారంటీ అని సీఎం రేవంత్‌రెడ్డి గొప్పులు చెప్పుకోవడం కాదు… ఆచరణలోనూ పాటించాలని హితువు పలుకుతున్నారు. ఇలా అరెస్టులు, నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలను, విపక్ష పార్టీల కార్యకలాపాలను ఎక్కువ కాలం అడ్డుకోలేరని స్పష్టం చేస్తున్నారు.
రాష్ట్రంలో ప్రజా పాలన తీసుకొచ్చినట్లు సీఎం రేవంత్‌రెడ్డి గొప్పగా చెప్తున్న మాటలన్నీ ఉత్తివేనని ఆచరణలో తేటతెల్లమవుతున్నది. ప్రజా పాలన అంటూ అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది తిరగక ముందే నిర్బంధకాండకు తెరలేపింది. ప్రారంభంలో కొంత ఉదారంగా ఉన్నట్లు కనిపించినా రానురానూ అన్నింటికీ నిర్బంధమే సమాధానం అన్నట్లుగా వ్యవహరిస్తున్నది. కొంత కాలంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఏ చిన్న ఆందోళన జరిగినా, సమస్యలపైన ఆయా వర్గాలు రోడ్ల మీదకు వచ్చినా ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పుతున్నది.
ప్రజా ఉద్యమాలను, నిరసనలు, ఆందోళనలను ఉక్కుపాదంతో అణచడమే ప్రభుత్వ ఆదేశాలు అన్నట్లుగా పోలీసులు రంగంలోకి దిగుతున్నారు. ముందస్తు హెచ్చరికలు, అరెస్టులు, నిర్బంధాలతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన ఎన్నో హామీలు అమలుకు నోచకుండా పెండింగ్‌లో ఉన్నాయి. మొదటి ఆరు నెలలు వివిధ వర్గాలు ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించపోతుందా అని వేచి చూశారు.
కానీ ఆచరణలో ప్రభుత్వ తీరు ఏ మాత్రమూ ఆమోదయోగ్యంగా లేకపోవడంతో ప్రజలు ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బందితోపాటు వివిధ వర్గాల ప్రజలు ప్రభుత్వ తీరుకు నిరసనగా రోడ్లమీదకు వస్తున్నారు. దశల వారీ పోరాటాల్లో భాగంగా స్థానికంగా ముందు ఆందోళనలు చేపడుతూ చివరగా చలో హైదరాబాద్, చలో అసెంబ్లీ లేదా చలో సెక్రటేరియేట్ వంటి కార్యక్రమాలకు సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నది.