– కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల అగచాట్లు
– దగాకోరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఎదురు చూస్తున్న ప్రజలు
– కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ, మే 29 : దేశంలోనే కేంద్ర పూల్ కు అత్యధికంగా ధాన్యాన్ని అందించిన రాష్ట్రంగా తెలంగాణను నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నంబర్ వన్ స్థానంలో నిలబెడితే.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా వంచిందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. శుక్రవారం కోదాడలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. నేడు రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద నెలల తరబడి టోకెన్ల కోసం పడిగాపులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ప్రతి క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని ఊదరగొట్టి తీరా అధికారంలోకి వచ్చాక సన్న వడ్లకే ఇస్తామని కొర్రీలు పెట్టి రైతన్నను పచ్చిగా మోసం చేయడంలో కాంగ్రెస్ నంబర్ వన్ స్థానంలో నిలబడిందని ఎద్దేవా చేశారు. పక్క రాష్ట్రం కంటే రెండు బస్తాలు ఎక్కువగా ధాన్యాన్ని కొనుగోలు చేశామని మంత్రి ఉత్తమ్‌కుమార్ చెప్పడం విడ్డూరంగా ఉందని, క్లాసులో అందరికంటే చివరగా వచ్చిన వాడితో తనని తాను పోల్చుకోవడం లాంటిదని, కాగితాల్లోనే ఆయన నంబర్ వన్ అని పేర్కొన్నారు.
అకాల వర్షానికి ధాన్యం తడిసి రైతులు దైన్యంగా చూస్తున్న పరిస్థితుల్లో కొనుగోలు చేయలేని దగా ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని విమర్శించారు..తరుగు పేరుతో రైతులను నిలువెల్లా దోచుకుంటున్నారని, జూన్ 1 లోగా కొనుగోలు ముగించాలని డెడ్‌లైన్ పెట్టడం దేనికి సంకేతం అని, అప్పటికి బోర్డు తిప్పేసి మిగిలిన ధాన్యాన్ని దళారులకు, మిల్లర్లకు తక్కువ ధరకు అమ్ముకునేలా చేయాలనుకోవడం రైతులను మోసం చేసినట్లు కాదా అని ఆయన ప్రశ్నించారు. కోదాడ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు మట్టి, ఇసుక, భూ కబ్జాలకు పాల్పడుతుంటే మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి వారికి వెన్నుదన్నుగా ఉన్నారని విమర్శించారు. రాష్ట్రం ఆవిర్భవించక ముందు ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం 14వ స్థానంలో ఉంటే ఉద్యమ నేత కేసిఆర్ పకడ్బందీ ప్రణాళికతో దేశంలో అగ్రస్థానానికి చేర్చారని కొనియాడారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క ఏడాదిలోనే ఏకంగా 1.41 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరించిన విషయాన్నిఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కొవిడ్ లాంటి సంక్షేమ సమయంలో కూడా రికార్డ్ స్థాయిలో ధాన్య సేకరణ జరిగిందన్నారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ధాన్యం కొనుగోలు ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లోకి రూ.26 వేల కోట్లు జమైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రైతులు తమ ధాన్యాన్ని దళారుల పాలు చేయకుండా నేరుగా తమ గ్రామాల పరిధిలోనే అమ్ముకునేలా ఐకెపిల ద్వారా 7 వేలకు పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌కు దక్కిందన్నారు. ధాన్యం నిల్వకు వందల కోట్లతో గోదాములు నిర్మించారన్నారు. రెండున్నర సంవత్సరాల దగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు.