కోదాడ, అక్టోబరు 26 : అసెంబ్లీ ఎన్నికల సమయంలో యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని నమ్మబలికి జాబ్ క్యాలెండర్ ప్రకటించినట్లు డబ్బా కొట్టుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగాలు భర్తీ చేయకుండా యువత ఆశలను గల్లంతు చేస్తోందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన కోదాడలో విలేకరులతో మాట్లాడుతూ హుజూర్‌నగర్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళా యువతకు ప్రభుత్వ ఉద్యోగవకాశాలు కల్పించేది కాదన్నారు.
జాబ్ మేళా పేరుతో ప్రచార ఆర్భాటమే కానీ యువతకు ఒరిగిందేమి లేదని అన్నారు. తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక జాబ్‌మేళాల పేరుతో యువతను మభ్యపెడుతున్నారన్నారు. ఆవగింజంత పోస్టులకు ఏనుగుంత ప్రచారమా అంటూ ఎద్దేవా చేశారు. వంద రోజుల్లో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని వాగ్ధానం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ హైదరాబాద్‌లోని అశోక్‌నగర్ చౌరస్తాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిరుద్యోగులపై లాఠీ ఛార్జీలు, అక్రమ అరెస్టులు చేసి ఉద్యమాన్ని అణచివేసిన విషయాన్ని గుర్తుచేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నియామక పత్రాలు అందించడమే తప్ప యువతకు ఒరిగిందేమీ లేదన్నారు. ఔట్‌సోర్స్ , కాంట్రాక్టు ఉద్యోగాల ఎంపికలో కాంగ్రెస్ నాయకులు, ఏజెన్సీల నుంచి లక్షల సొమ్మును కమీషన్ల రూపంలో దండుకుంటున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. యువతకు కావాల్సింది అబద్ధాల మేళాలు కాదని నిజమైన ఉద్యోగ అవకాశాలన్నారు. యువత వాస్తవాలను గమనించి కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని గమనించి, రానున్న రోజుల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.