నకిరేకల్, ఆగస్టు 21 : కాంగ్రెస్ ప్రభుత్వానికి సాగునీరు అందించే సోయి లేదు, యూరియా సరఫరా చేసే సోయి లేదు, పండించే పంటను కొనుగోలు చేసే సోయి లేదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం నకిరేకల్ మండల కేంద్రంలోని తాటికల్ సింగిల్ విండో కార్యాలయం వద్ద యూరియా కోసం పడిగాపులు కాస్తున్న రైతులతో ఆయన మాట్లాడారు. యూరియా కోసం ఎండలో నిలబడ్డ రైతులు, చంటి పిల్లలతో వచ్చిన మహిళా రైతులు, లైన్లో చెప్పులు, ఆధార్ కార్డ్ లు పెట్టి యూరియా కోసం ఎదురుచూస్తున్న రైతన్నల బాధలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకుల మాయమాటలతో తెలంగాణ ప్రజానీకం మోసపోయిందన్నారు. ప్రజా అవసరాలు తీర్చాలనే ముందు చూపు లేని దద్దమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డిది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్నివర్గాల ప్రజలు నష్టపోతున్నట్లు తెలిపారు. దళారి వ్యవస్థతో, దగాకోరు మాటలతో ప్రభుత్వం పబ్బం గడుపుతోందని దుయ్యబట్టారు.
రైతులను అన్ని విధాలుగా మోసం చేసిన దౌర్భాగ్యపు ప్రభుత్వం రేవంత్ రెడ్డిది అన్నారు. కేసీఆర్ పాలనలో పదేండ్లు యూరియా కొరత రాలేదన్నారు. రైతులకు యూరియానే ఇవ్వలేని దద్దమ్మ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి అర్హుడే కాదన్నారు. ఎరువుల కొరత లేదు అనే సీఎం, మంత్రులకు ఎరువులు సరఫరా చేసే ఏదైనా ఒక సొసైటీ దగ్గరరికి వెళ్లి నిలబడే దమ్ముందా? అని ఆయన ప్రశ్నించారు. యూరియా కోసం పడిగాపులు కాస్తున్న రైతుల ముందు వెళ్లి నిలబడితే వారి ఎమ్మెల్యేలను, మంత్రులను ప్రజలు చెప్పులతో కొడతారన్నారు. గత 10 సంవత్సరాలుగా ఉన్న అధికారులే ఇప్పుడు ఉన్నారు, అప్పుడు ఉన్నంత భూమే ఇప్పుడు ఉంది, అప్పుడు వేసిన పంటలే ఇప్పుడు వేసినా యూరియా కొరత ఎందుకు వచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అపుడు కేసీఆర్ ఇచ్చిన యూరియాను ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు ఇవ్వలేక పొతున్నాడని ప్రశ్నించారు.
కేసీఆర్ పాలనలో ఒక్క సొసైటీలో ఎప్పడు కూడా 1000 MTs కంటే తక్కువ ఎరువులు లేవని చిరుమర్తి అన్నారు. కానీ ఇప్పుడు అవే సొసైటీలో ఈ సంవత్సరం 400 MTs ఎరువులు మాత్రమే ఉన్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పాలనలో ఇప్పుడు 25 శాతం యూరియా కూడా అందుబాటులో లేదన్నారు. ఎరువుల కొరత లేదు అని సిగ్గు లేకుండా సీఎం ప్రచారం చేస్తున్నడని దుయ్యబట్టారు. వేలమంది రైతులు రోజుల తరబడి యూరియా కోసం తల్లడిల్లుతుంటే రాష్ట్రంలో అసలు యూరియా కొరత లేనట్లు, కృత్రిమ కొరత సృష్టించారని రేవంత్‌రెడ్డి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడన్నారు. రేవంత్ రెడ్డి వారానికి ఒకసారి ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నాడో, ఎవరికి మూటలు అప్పజెప్పుతున్నాడో సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ మంత్రులను, ఎమ్మెల్యేలను గ్రామాల్లో ఉరికించి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. రేవంత్ రెడ్డి, వారి మంత్రులు ఢిల్లీకి వెళ్లి మోదీ కాళ్లు మొక్కి అయినా సరే రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలన్నారు. రైతుపైన నిజమైన ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలోని రైతన్నకు కన్నీరు రానివ్వకండని హితవు పలికారు. లేదంటే రైతులకు యూరియా ఇవ్వలేమని క్షమాపణ చెప్పి ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని పేర్కొన్నారు.
Nakrekal : ముందు చూపు లేని దద్దమ్మ ప్రభుత్వం రేవంత్‌రెడ్డిది : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య