సూర్యాపేట, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో ప్రజలకు ఆశజూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది కాలంగా మోసం చేస్తూ వస్తున్నది. ప్రధానంగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపన్నులను ఆదుకునేందుకు కనీవినీ ఎరుగని రీతిన రూ.2వేలకు పింఛన్లు పెంచి ఇవ్వగా అంతకు రెట్టింపు చేసి చేయూత పేరిట రూ.4వేలు ఇస్తామని కాంగ్రెస్ నమ్మించి నట్టేట ముంచుతున్నది.
ఏడాది కాలంగా కేసీఆర్ ఇచ్చిన రెండు వేల రూపాయలతోనే సరిపెడుతున్నది. నెలనెలా పింఛన్ తీసుకునేందుకు వెళ్తున్న వృద్ధులు, వితంతువులు ఈ న్లైనా పింఛన్ పెరిగిందా అంటూ అధికారులను అడుగడం పరిపాటిగా మారింది. పింఛన్ పెంచుతామని చెప్పి మోసం చేసిన రేవంత్ సర్కార్‌పై వృద్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగంలో దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. అన్ని వర్గాల ప్రజలకు సంతృప్తికరంగా సంక్షేమ ఫలాలు అందేలా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు మిగతా రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచాయనడంలో సందేహం లేదు. ప్రధానంగా కేసీఆర్ హయాంలో పింఛన్ల పంపిణీని సామాజిక బాధ్యతగా తీసుకొని దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనంతగా ఇక్కడ అమలు చేశారు. ఏ దిక్కూ లేని వారందరినీ పింఛన్ల పరిధిలోకి తీసుకొచ్చి కేసీఆర్ కొండంత అండగా నిలిచారు.
సమైక్య రాష్ట్రంలో రెండు వందల రూపాయాలు ఉన్న ఆసరా పింఛన్‌ను అమాంతం పెంచిన విషయం విదితమే. తొలుత దివ్యాంగులకు రూ.1,500, వృద్ధులు, వితంతువులు, చేనేత, గీత కార్మికులకు రూ.1,000 చొప్పున అందించారు. సమాజంలో ఉండే ఒంటరి మహిళలకు సైతం పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించి వారికి సైతం ఇచ్చారు. కాగా పెరుగుతున్న ధరలతో పెన్షన్ దారులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన కేసీఆర్ 2018 శాసనసభ ఎన్నికల సమయంలో ఆసరా పెన్షన్లు పెంచాలని నిర్ణయించారు. ఆ తర్వాత వృద్ధులు, వితంతువులు, చేనేత, గీత కార్మికులు, ఒంటరి మహిళలకు రూ.2,016, దివ్యాంగులకు రూ.3,016 చొప్పున పింఛన్‌ను అమలు చేశారు. అంతేకాకుండా 65 సంవత్సరాల వయసు ఉన్నవారికి ఇచ్చే వృద్ధాప్య పెన్షన్‌ను 57 సంవత్సరాలకు కుదించి అమలు చేశారు.
బీఆర్ఎస్ హయాంలో ఆసరా పింఛన్లను అమాంతం పెంచి ఇవ్వగా, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్లను రూ.2 వేల నుంచి రూ.4వేలకు పెంచుతామని, ఇంటికి ఒక్కరు కాదు ఇద్దరున్నా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీని మరిచిపోయారు. ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో 1,47,834 మందికి వివిధ రకాల పింఛన్లు అందుతున్నాయి. ఆరు గ్యారెంటీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత కింద రూ.4వేలు పెన్షన్ అందిస్తామని చెప్పింది. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తయినా ఇంత వరకు పింఛన్ల పెంపుదల లేదు. ప్రస్తుతం కొత్త దరఖాస్తుల స్వీకరణ లేదు. ఇచ్చిన హామీకి దిక్కులేకుండా పోయింది. దీంతో గ్రామాల్లో పెన్షన్ల పెంపు కోసం వృద్ధులు వేయి కండ్లతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం నెలకు 2,016 రూపాయలే చేతికి అందుతున్నది. అది కూడా కేసీఆర్ హయాంలో పెంచిన మొత్తమే కావడం గమనార్హం. వెంటనే రేవంత్ సర్కార్ తమకు ఇచ్చిన హామీ మేరకు పింఛన్‌ను రూ.4వేలకు చేయాలని పింఛన్‌దారులు కోరుతున్నారు.
ఎన్నికల ముందు కాంగ్రెసోళ్లు ముసలోళ్లకు పింఛన్‌ను 4వేలకు పెంచుతామని చెప్పిండ్రు. గెలిచి సంవత్సరం అయినా పెంచలేదు. ఎప్పుడు పెంచుతారోనని ఎదురు చూస్తున్నాం. ధరలేమో పెరిగిపోతున్నాయి..పింఛన్ డబ్బులే మాలాంటోళ్లకు ఆసరా. వెంటనే పింఛన్ పెంచి ఇవ్వాలి.
-రెబ్బ రాములమ్మ, మాచవరం, హుజూర్నగర్ మండలం
4వేలకు పింఛన్ పెంచి ఇస్తామంటేనే కాంగ్రెస్ నమ్మి ఓట్లు వేశారు. కానీ ఏడాదైనా పెంచకుండా మోసం చేస్తున్నరు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇస్తామని చెప్పిండ్రు. ఇంట్లో ఇద్దరికి కూడా పెన్షన్ ఇస్తామన్నరు. కానీ పోయిన ప్రభుత్వంలో ఇచ్చినట్లే ఇస్తున్నరు. కొత్తగా రేవంత్ సర్కారు ఇచ్చిందేమీ లేదు.
– జక్కి నర్సయ్య, అనంతారం, పెన్‌పహాడ్ మండలం
పింఛన్‌ను 4వేల రూపాయలకు పెంచుతామంటేనే జనం కాంగ్రెసోళ్లకు ఓట్లు వేసి గెలిపించారు. పింఛన్లు పెంచకుండా ఏడాది కాలంగా ప్రజలను మభ్యపెట్టడం సరికాదు. కేసీఆర్ సర్కారు రెండు సార్లు పింఛన్ పెంచి నెలనెలా సమయానికి ఇచ్చింది. రేవంత్ సర్కారు వెంటనే పింఛన్లు పెంచి పేదలకు అండగా నిలువాలి.
-నర్సమ్మ , రామాపురం, నడిగూడెం