నకిరేకల్, జూన్ 20 : కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల రాష్ట్రంలో వెయ్యి మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, అన్నపూర్ణగా ఉన్న తెలంగాణను అనాథ తెలంగాణగా మార్చే యత్నం చేస్తున్నారని, రైతులకు ద్రోహం చేసిన కాంగ్రెస్ సర్కార్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, రైతు పండించిన ప్రతి గింజా కొనేంత వరకూ బీఆర్ఎస్ ఉద్యమిస్తుందని, వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 70 లక్షల మంది రైతులతో జంగ్ సైరన్ మోగిస్తామని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ఎంత ధాన్యం కొనుగోలు చేస్తుందో అంతే ధాన్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై నకిరేకల్‌లోని సువర్ణగార్డెన్ ఫంక్షన్ హాల్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పంజాబ్‌నే తలదన్నేలా దేశంలోనే అత్యధిక ధాన్యం పండించే రాష్ట్రంగా తెలంగాణను మార్చారన్నారు. పదేళ్ల పాటు పండుగలా మారిన వ్యవసాయాన్ని కేవలం రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి మళ్లీ తెలంగాణను 60 ఏండ్ల సమైక్య పాలన నాటి పరిస్థితుల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు.
రైతుకు రక్షణగా ఉన్న ఒక్కో పథకాన్ని ఊడగొట్టే పనిలో పడ్డాడన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కొనకుండా కల్లాల్లోనే రైతులు కన్నుమూసేలా చేస్తున్నాడని ఆరోపించారు. ఎన్నికల సమయంలో చివరి గింజ వరకూ కొంటామని, రూ.500 బోనస్ ఇస్తామని అబద్ధపు హామీలు ఇచ్చారన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా అన్ని పంటలు ఎందుకు కొంటలేరు..అని ప్రశ్నించిన రేవంత్‌రెడ్డి ఇప్పుడెందుకు చేతులెత్తేశాడని ప్రశ్నించారు. 2021లో చేపట్టిన రైతు దీక్షలో పీసీసీ అధ్యక్షుడిగా పది వేల కోట్లు ఇస్తే అన్ని పంటలు కొని చూపిస్తా అని ప్రగల్భాలు పలికిన రేవంత్ ముఖ్యమంత్రిగా రైతులకు ఖర్చు చేసేందుకు రూ.10 వేల కోట్లు లేవా అని ప్రశ్నించారు. 40 రకాలుకున్న బోనస్‌ను కేవలం 7 రకాల సన్నాలకే కుదించి రైతులను దొంగ దెబ్బ తీశారన్నారు. కేంద్రం కోటాకు మించి ఏ పంట కొనబోమని చెప్పడమంటే రైతును దివాళా తీయించడమేనన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిందిపోయి రైతులను పాతాళంలోకి నెట్టేస్తారా అని ప్రశ్నించారు. రైతులు పండించిన ప్రతి గింజా కొనేంత వరకూ బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందని, కొనకపోతే మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రగడపు నవీన్‌రావు, మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ పల్రెడ్డి మహేందర్‌రెడ్డి, తాటికల్ సర్పంచ్ బంటు రవి, పార్టీ మండల ఉపాధ్యక్షుడు గుండగోని జంగయ్య, మాజీ కౌన్సిలర్ పల్లె విజయ్, మాజీ ఎంపీటీసీలు రాచకొండ వెంకన్న, ఇమడపాక వెంకన్న, రావిరాల మల్లయ్య, దైద పరమేశం, కొండ వినయ్, ఎమ్‌డి అఖిల్ పాల్గొన్నారు.