సూర్యాపేట, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ‘గత ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చింది. మరోసారి మోసాలు చేయడం కొనసాగింపు చేసే బడ్జెట్ తప్ప మరొటి కాదు’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొత్తగా స్కాంలు చేసేందుకు కాంట్రాక్టర్లకు కొమ్ముకాసేలా నిధులు కొంతమేర కేటాయించి ప్రజల చెవుల్లో పూలు పెట్టారని దుయ్యబట్టారు. ‘బడ్జెట్ అంతా మోసం. ఆరు గ్యారంటీలను అసలే మర్చిపోయారు. ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగల ప్రస్తావన లేదు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే మహిళలకు రూ.2,500 ఇస్తామన్న హామీ ఊసేలేదు. పింఛను పెంచుతామన్నారు. రైతు భరోసా రూ.15 వేలు ఎటువాయె. రైతులతో పాటు అన్ని వర్గాలను దారుణంగా వంచించారు’ అని అన్నారు. ఊకదంపుడు ఉపన్యాసంలా చదివారు తప్ప మరొటికాదన్నారు. రైతు కూలీలకు రూ.వెయ్యి ప్రస్తావన లేదని, ఆటో కార్మికులను మోసం చేశారని, ఆర్టీసీ కార్మికుల ప్రస్తావన లేదని మండిపడ్డారు. అంకెలు వేసి బడ్జెట్ పొందుపర్చారన్నారు. కమీషన్లు వచ్చే వాటికి నిధులు కేటాయించుకున్నారని ఆరోపించారు. ఇది తెలంగాణ ప్రజలకు నిరాశ కల్గించిన రోజన్నారు. మోసం చేయడం కాంగ్రెస్‌కు ఆనవాయితీగా వస్తోందన్నారు. ఎన్నికల ముందు నిరుద్యోగులను రెచ్చగొట్టి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారని, ఈసారైనా ప్రస్తావించకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు.
రామగిరి, మార్చి 20: ప్రభుత్వ అసెంబ్లీలో ప్రవేశపెట్టి బడ్జెట్లో ఎస్సీల సంక్షేమానికి 70 శాతం నిధుల కోత పెట్టారు. దళితుల అభివృద్ధి ఒట్టిబూటకంగా చూపించారు. గత బడ్జెట్లో రూ.40,232 కోట్లు కేటాయించగా ఈసారి రూ.11,784 కోట్లు మాత్రమే చూపించారు. దళిత బంధుకు రూ.10 లక్షలు, అంబేద్కర్ ఓవర్సీస్ ద్వారా రూ.12 లక్షలు ఇస్తామన్నా… ఆ దిశగా నిధులు కేటాయించలేదు. ప్రభుత్వ బడ్జెట్ సవరించి రూ. 50 వేల కోట్లు ఎస్సీల సంక్షేమానికి కేటాయించాలి.
రామగిరి, మార్చి 20: అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ మిశ్రమమే. ఇందులో ప్రజలకు ఆశించిన ప్రయోజనాలు లేవు. పెన్షన్స్ రెట్టింపు చేయలేదు. గీత కార్మికులు, యాదవులు, ముదిరాజులు, చేనేత కార్మిక వృత్తి సంఘాలకు బడ్జెట్లో కేటాయించలేదు. విద్యకు 20 శాతం డిమాండ్ చేస్తుంటే 8 శాతం మాత్రమే కేటాయించారు. ఆరోగ్యానికి 4 శాతం కేటాంచారు. కొత్తగా ఇందిరమ్మ బీమా పథకం కింద ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఇస్తున్నామని పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, నైపుణ్యాభివృద్ధికి ఈ బడ్జెట్ దిశా నిర్దేశం చేయలేదు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై స్పష్టత లోపించింది. బడ్జెట్ కేవలం అసెంబ్లీ ప్రసంగాలకు కాకుండా బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి తొడ్పడేలా ఉండాలి. కేటాయించిన నిధులు పూర్తిస్థాయిలో ఖర్చు చేసేలా పారదర్శకమైన చర్యలు తీసుకోవాలి.
రామగిరి, మార్చి 20: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంకెలు తప్ప సంక్షేమ రంగాలను విస్మరించారు. వ్యవసాయ రంగానికి అధిక మొత్తం కేటాయించినా ఆచరణలో మాత్రం ఖర్చు కావడం లేదు. నల్లగొండ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు పూర్తిగా నిధులు కేటాయించలేదు. నక్కలగండి, డిండి ఎత్తిపోతల పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయిస్తే పూర్తి కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది. శ్రీశైలం సొరంగమార్గం పూర్తికి యుద్ధ ప్రతిపాధికన చర్యలు తీసుకోవాలి. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం చూపారు. మహిళలకు వడ్డీలేని రుణాలతోపాటు స్వయం శక్తితో ఆర్థికంగా ఎదుగుదలకు ప్రత్యేకమైన చర్యలు లేవు. ప్రజల అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ లేదు. దీనిపై నిర్మాణాత్మక పోరాటాలు చేయాల్సి అవసరం ఉంది.
రామగిరి, మార్చి 20: బడ్జెట్లో విద్యా రంగానికి కేవలం 8.2 శాతం నిధులు కేటాయించి పూర్తిగా అన్యాయం చేశారు. కాంగ్రెస్ ఫ్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టులో విద్యకు 15 శాతం నిధులు కేటాయిస్తామని ప్రకటించి ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం బాధాకరం. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌పై ఉన్న శ్రద్ధ ప్రధాన స్రవంతి పాఠశాలలపై బడ్జెట్లో చూపలేదు. పీఆర్సీ గురించి ప్రస్తావింలేదు. విద్య శాఖను తన వద్ద ఉంచుకుని పరిపాలన చేస్తున్న సీఎం ఆ రంగానికి మొండిచేయి చూపారు. ఇప్పటికైనా పునరాలోచించి కేటాయింపు చేయాలి.
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆరు గ్యారంటీలకు తూట్లు పొడిచి అంకెల గారడిగా మారింది. ఈ బడ్జెట్లో ముఖ్యమైన రంగాలకు కేటాయింపులు తక్కువ చేశారు. రైతాంగాన్ని పూర్తిగా విస్మరించారు. వ్యవసాయరంగానికి సరైన నిధులు కేటాయించడంలో విఫలమయ్యారు. సాగునీటికి కేవలం రూ.22 వేల కోట్లు, విద్యుత్ రంగానికి రూ.20 వేల కోట్లు ఏ మూలకు సరిపోవు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉండీ ఏ ఒక్క రంగానికీ సరైన ప్రాధాన్యత తేలేకపోయారు. సాగునీటి ప్రాజెక్టులతో పాటు విద్య, నిరుద్యోగ రంగానికి అతి తక్కువగా కేటాయింపులు చేశారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సరైన కేటాయింపులు చేయలేదు. ఇచ్చిన హామీలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు జరగలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఈ బడ్జెట్లో తీవ్ర అన్యాయం జరిగింది. ఇది ముమ్మాటికి ప్రజా వ్యతిరేక బడ్జెట్.