ఆలేరు టౌన్ , ఏప్రిల్ 5: గజ్వేల్‌లోని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా ఆలేరు నియోజకర్గ ఇంచార్జి, ప్రభుత్వ మాజీ విప్ ,ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గజ్వేల్ క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి బీఆర్ఎస్ సైనికులతో కలిసి ఆలేరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఆదివారం ముట్టడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ధ్వంసం చేయడమంటే.. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడమేనని కాంగ్రెస్ సర్కార్‌పై ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి రాకుండా రేవంత్‌రెడ్డి అడుగుజాడల్లో నడుస్తున్నారని ఫైర్ అయ్యారు.
రేవంత్‌రెడ్డి , భట్టి విక్రమార్క తమ సొంత ఇంటి నిర్మాణం కోసం వందల కోట్లు కేటాయించి ఇంటిని అద్భుతంగా నిర్మిస్తూ ప్రజాధనాన్ని లూటి చేస్తున్నారని ఆమె సర్కార్‌పై మండిపడ్డారు. కాంగ్రెస్ గూండాలు గజ్వేల్ క్యాంపు కార్యాలయంలో చొరబడి కేసీఆర్ ఫొటోను తొలగించి, రేవంత్‌రెడ్డి ఫొటో పెట్టడం సమంజసమేనా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ జోలికోస్తే ఉక్కు పాదంతో అణచివేస్తామని హెచ్చరించారు. అనంతరం నిరసన కారులను యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస్ నాయుడు, సీఐ శంకర్‌గౌడ్, ఆలేరు ఎస్సై వినయ్ , పోలీసు బీఆర్ఎస్ నాయకులను , కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేశం గౌడ్, కౌన్సిలరుల పాకాల మౌనికహరీష్, బీజన కళ్యాణిమధు, యాట శివ,మాజీ ఏఎంసీ చైర్మన్ గ్యాదపాక నాగరాజు, బీఆర్ఎస్ నాయకులు ఆడెపు బాలస్వామి, పత్తి వెంకటేష్, కుండె సంపత్ ,పూల శ్రవణ్ ,మోర్తాల రమణారెడ్డి, అజయ్, ఎండీ ఫయాజ్, ఎండీ జమాల్, బాలరాజు, ప్రశాంత్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.