సూర్యాపేట టౌన్/ రామగిరి, డిసెంబర్ 28 : తమ సమస్యలను పరిష్కరించి రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ 18 రోజులుగా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు శనివారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. నల్లగొండ కలెక్టరేట్ వద్ద గాంధీ టోపీలు పెట్టుకొని మౌన దీక్ష చేపట్టారు. అనంతరం నల్లగొండకు వచ్చిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రధాన వీధుల గుండా శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్‌కు తరలివెళ్లారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సంఘం సూర్యాపేట, నల్లగొండ జిల్లాల అధ్యక్షులు రాంపంగు వెంకటేశ్వర్లు, మొలుగురి కృష్ణ మాట్లాడుతూ ఎన్నికల ముందు హనుమకొండలో జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి టీ తాగేలోపు సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి నేటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
వంద రోజుల్లో ప్రజాభవన్‌కు పిలిచి జీఓ జారీ చేస్తానని చెప్పి సంవత్సరం గడుస్తున్నా స్పందన లేదని విమర్శించారు. తాము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నా పట్టించుకునే నాథుడు లేడని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, లేకుంటే పే స్కేల్ అయినా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమాల్లో సంఘం రాష్ట్ర కార్యదర్శులు గడ్డం శ్రీనివాస్, కంచర్ల మహేందర్, సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరమణ, ఉపాధ్యక్షుడు రాంబాబు, కోశాధికారి లక్ష్మీనారాయణ, నాయకులు సయ్యద్, తేజస్వీ, సఫియా, వసంత, సరస్వతి, శ్రీను, రవీందర్, ఫయాజ్, జమాల్, సైదయ్య పాల్గొన్నారు.