నల్లగొండ, జూన్ 27: చెరువులు, కుంటలల్లో ఆక్రమణలకు పాల్పడితే కేసులు నమోదు చేసి కబ్జా చెరల నుండి భూములు విడిపించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం ఆమె కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో ఇరిగేషన్, ఇంజినీరింగ్ అదికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గతంలో జరిగిన ఆక్రమణలు అరికట్టడంతో పాటు కొత్తగా ఎలాంటి ఆక్రమణలు జరకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని లేఅవుట్లు, పర్మిషన్లను నీటి పారుదల శాఖ పరిశీలించిన తర్వాతనే అనుమతి ఇవ్వాలని అన్నారు.
చెరువుల్లో ఆక్రమణ జరిగినట్లయితే వెంటనే పోలీస్ కేసు నమోదు చేయాలని..ఎక్కడైనా ఎలాంటి ఆక్రమణలు, నిర్మాణాలు జరగరాదని అన్నారు. నిర్మాణాల విషయంలో తహశీల్దార్లు, ఆర్డీవోలు తప్పనిసరిగా ఇరిగేషన్ శాఖ నుండి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలని అన్నారు. మిర్యాలగూడ డివిజన్లో ఇరిగేషన్ చెరువులకు సంబందించి సర్వేను త్వరితగతిన పూర్తి చేసి జియో కో ఆర్డినేటర్స్ తయారు చేయాలని సబ్ కలెక్టర్ అమిత్ నారాయణను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, అమిత్ నారాయణ, దేవరకొండ ఆర్డీవో రమణారెడ్డి, ఐబీ అదికారి పర్వతీశ్వర్రావు, సర్వే ల్యాండ్స్ ఏడీ సుజాత తదితరులు పాల్గొన్నారు.