సూర్యాపేట, జనవరి 6 : సూర్యాపేట జిల్లాలో వానకాలం ధాన్యం కొనుగోళ్లు డిసెంబర్ చివరి నాటికే పూర్తికాగా జనవరి మొదటివారం పూర్తయ్యే సరికి నగదు చెల్లింపులు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా వానకాలం సీజన్లో 4,67,082 ఎకరాల్లో రైతులు వరి సాగు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ధాన్యం దిగుబడి వస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సుమారు 11లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందనే అంచనాతో ఈ సీజన్లో 6.11 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. అందుకు తగ్గట్టుగానే జిల్లా వ్యాప్తంగా 256 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో ఐకేపీ సెంటర్లు 158, పీఏసీఎస్ 98 కేంద్రాలను ప్రారంభించి కొనుగోళ్లు చేశారు.
దాదాపు 50 రోజులకు పైగా జిల్లావ్యాప్తంగా సుమారు 45,746 మంది రైతుల నుంచి 2,58,154.640 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగింది. ఇందులో ఐకేపీ కేంద్రాల ద్వారా 1,73,800.040 మెట్రిక్ టన్నులు, పీఏసీఎస్ ద్వారా 84,354.600 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ధాన్యం విలువ రూ.531.80 కోట్లు కాగా వాటిని వెంట వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేస్తూ వచ్చారు. దాదాపు రూ.531 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కాగా 150 మంది రైతులకు సంబంధించి కేవలం రూ.80 లక్షల వరకు రైతుల ఖాతాల్లో సమస్యలు, ఇతర టెక్నికల్ సమస్యలతో చెల్లింపులో ఆలస్యమైనది. వాటిని సైతం ఒకటి రెండు రోజుల్లో పరిష్కరించి జమ చేయనున్నారు. అందుకు నగదు సైతం అధికారుల వద్ద ఉన్నది. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యంలో అత్యధికంగా గ్రేడ్-1 మద్దతు ధర రూ.2060 వచ్చాయి. దాదాపు 99 శాతం ధాన్యానికి మద్ధతు ధర లభించింది. ధాన్యం కొనుగోళ్ల కోసం ప్రభుత్వం 64,88,681 గన్నీ బ్యాగులు జిల్లాకు పంపగా 64,53,866 గన్నీ బ్యాగులను ఉపయోగించడం జరిగింది.
సమస్యలు త్త్రకుండా కొనుగోళ్లు
జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు నగదు చెల్లింపులు పూర్తి కావచ్చాయి. వానకాలం సీజన్లో 45,746 మంది రైతుల నుంచి దాదాపు రూ.531.80 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు రూ.531 కోట్లు చెల్లించాం. రైతుల ఖాతాల్లో సమస్యలు, ట్యాబ్ ఎంట్రీ సమయంలో వచ్చిన సమస్యల వల్ల కొంతమందికి ఆలస్యమైనది. వాటిని సెంటర్ల వారీగా గుర్తించి పరిష్కరించి వేస్తున్నాం. ఒకటి రెండు రోజుల్లో వంద శాతం నగదు చెల్లింపులు పూర్తి అవుతాయి. సమస్యలు లేకుండా కొనుగోళుల, చెల్లింపులు పూర్తి అయ్యాయి.
– రాంపతీనాయక్, డీఎం,సివిల్ సప్లయ్, సూర్యాపేట