నల్లగొండ ప్రతినిధి, మార్చి31(నమస్తే తెలంగాణ): ఈ ఏడాది మార్చి 31 వరకు అర్హులైన ప్రతి రైతుకు ఎకరాకు 6వేల రూపాయల చొప్పున రైతుభరోసాను అందించి తీరుతాం’ అని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా గత జనవరి 26 న పైలెట్ గ్రామాల్లో పథకాలను ప్రారంభిస్తూ అట్టహాసంగా ప్రకటించారు. కానీ వాస్తవంలో ఆగుతూ సాగుతూ అన్నట్లుగా రెండు నెలల ఐదు రోజుల్లో నాలుగు విడుతల్లో కేవలం నాలుగు ఎకరాల విస్తీర్ణం వరకు ఉన్న రైతులకు మాత్రమే రైతుభరోసా డబ్బులు ఖాతాల్లో జమయ్యాయి. సగం మందికి పైగా రైతులు రైతుభరోసా కోసం నిత్యం ఎదరుచూస్తూనే ఉన్నారు. ఫోన్ కు ఏదైనా మెసేజ్ వచ్చిన ప్రతీసారి రైతుభరోసా డబ్బులు పడ్డాయేమోనన్న ఆశతో చెక్ చేస్తుంటే నిరాశే ఎదురవుతున్నది. వరంగల్ రైతు డిక్లరేషన్, ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన ఏడాదికి రూ.15వేల రైతుభరోసా హామీని తుంగలో తొక్కుతూ రూ.12వేలు మాత్రమే ఇస్తానని చేసిన ప్రకటన కూడా ఆచరణకు నోచడం లేదు. గత వానకాలం సీజన్ అనర్హుల ఏరివేత పేరుతో అభిప్రాయాలు, చర్చలు, సర్వేలు అంటూ కాలయాపన చేస్తూ మొత్తానికే డబ్బులు ఎగొట్టిన విషయం తెలిసిందే.
ఇక యాసంగి నుంచి ఎకరాకు రూ.6వేలు మాత్రమే ఇస్తామని చెప్పి, అది కూడా మార్చి చివరి నాటికి పూర్తి చేయలేదు. ఈ ఏడాది జవవరి 26 నుంచి రైతుభరోసాతోపాటు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు ప్రభుత్వం లాంఛనంగా శ్రీకారం చుట్టింది. ముందుగా మండలానికి ఒక పైలెట్ గ్రామాన్ని ఎంపిక చేసి అక్కడ వందశాతం గ్రౌండింగ్ పూర్తి చేస్తామని ప్రకటించారు. ఆ గ్రామాల్లో మాత్రం అందరికీ రైతుభరోసా వేసినట్లు చేశారు. మిగతా గ్రామాల్లోని రైతులకు అప్పటి నుంచి ఎదురుచూపులు తప్పడం లేదు. ఆ సందర్భంగానే రాష్ట్రంలోని సాగుయోగ్యమైన ప్రతి ఎకరాకూ మార్చి 31లోగా రైతుభరోసా డబ్బులు పూర్తిగా చెల్లిస్తామని సీఎం రేవంత్ ఆర్భాటంగా ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో నాలుగు ఎకరాల విస్తీర్ణం వరకు ఉన్న రైతులకు మాత్రమే రైతుభరోసా డబ్బులు పడ్డాయి. మిగతా సగం మందికి పైగా రైతులకు ఎప్పటివరకు పెట్టుబడిసాయం పడుతుందనేది అంతుచిక్కని రహస్యంగా మారింది.
ఉమ్మడి జిల్లాలో 26 లక్షల
ఎకరాలుఉమ్మడి నల్లగొండ జిల్లాలో రైతుభరోసా అందాల్సిన భూమి విస్తీర్ణం సుమారు 26లక్షల ఎకరాల వరకు ఉన్నట్లు అంచనా. దీనికి సంబంధించి రైతుల సంఖ్య 11 లక్షలకు పైచిలుకు ఉన్నట్లు వ్యవసాయ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. వీరికి సుమారుగా రూ.1,560 కోట్ల వరకు రైతుభరోసాగా అందాల్సి ఉంది. కానీ ఇందులో సగం మాత్రమే పూర్తయింది . సీఎం చేసిన ప్రకటన ప్రకారం సోమవారం నాటికే పూర్తి స్థాయిలో రైతుభరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమకావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు నాలుగు విడతలుగా వీటిని జమ చేస్తూ వచ్చారు. కేసీఆర్ సర్కార్ హయాంలో చివరి సారిగా 2023 వానకాలంలో రైతుబంధును అమలు చేశారు. అది వరుసగా 11వ సీజన్ రైతుబంధు కావడం విశేషం. ఆ సమయంలో ఉమ్మడి జిల్లాలో సుమారు 26లక్షల ఎకరాలకు సంబంధించిన 10.80 లక్షల మంది రైతులకు రూ.1,250 కోట్లను పెట్టుబడి సాయంగా అందించారు. అదే ఏడాది ఎన్నికల సమయంలోనూ యాసంగి రైతుబంధు అమలుకు కేసీఆర్ ప్రభుత్వం సిద్ధం కాగా కాంగ్రెస్ నేతలు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఇవే డబ్బులను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎకరాకు అదే ఐదు వేల చొప్పున తప్పనిసరి పరిస్థితుల్లో ఇచ్చారు.
వచ్చింది రూ.788.86 కోట్లు మాత్రమే..
ఉమ్మడి జిల్లాలో నాలుగు విడుతల్లో ఇప్పటి వరకు నాలుగు ఎకరాల విస్తీర్ణం వరకు మాత్రమే డబ్బులు జమ చేయగా సోమవారం నాటికి రూ.788.86 కోట్లు రైతుల ఖాతాల్లో పడ్డాయి. ఇంకా రూ.800కోట్ల వరకు భరోసా డబ్బులు రైతులకు అందాల్సి ఉంది. వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం… నల్లగొండ జిల్లాలో ఇప్పటివరకు రూ.419.21 కోట్ల రైతుభరోసా మాత్రమే రైతుల ఖాతాలకు చేరింది. ఇంకా రూ.300 కోట్లకు పైగా పెండింగ్ ఉన్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. జిల్లాలో మొత్తం 4.33 లక్షల మంది రైతులకు చెందిన 6.98లక్షల ఎకరాల భూమికి మాత్రమే భరోసా డబ్బులు పడ్డాయి. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం 2.81లక్షల మంది రైతులు ఉండగా, వారికి సుమారు రూ.300 కోట్ల వరకు రైతుభరోసా డబ్బులు పడాల్సి ఉంది. ఇప్పటివరకు 1.68లక్షల మంది రైతులకు చెందిన 2.27లక్షల ఎకరాల భూమికిగానూ రూ.136.73 కోట్ల రూపాయలను జమ చేశారు. సూర్యాపేట జిల్లాలో మొత్తం 3.03లక్షల మంది రైతులకు గానూ రూ.376.89 కోట్ల రూపాయలు చెందాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు 2.44లక్షల మంది రైతులకు సంబంధించి 3.88లక్షల ఎకరాలకు గానూ రూ.232.92 కోట్లు మాత్రమే రైతు భరోసా అందింది.
మిగతా వారికి ఎప్పుడో…
వాస్తవంగా నాలుగు ఎకరాల్లోపు రైతులకు కేసీఆర్ సర్కార్ హయాంలో తొలి నాలుగు రోజుల్లోనే రైతుబంధు డబ్బులు పడేవి. రోజుకో ఎకరం చొప్పున పదిహేను ఇరవై రోజుల్లోనే రైతులందరికీ రైతుబంధు డబ్బులు టకటకా ఖాతాల్లో జమయ్యేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి 26 నుంచి మొదలు పెట్టినా 2 నెలల ఐదు రోజుల్లో నాలుగు విడుతలుగా నాలుగు ఎకరాల రైతుల వరకు మాత్రమే భరోసా డబ్బులు జమ చేసింది. ఇక మిగతా రైతుల సంగతి ఏంటనేది అర్ధం కాని విషయం. సీఎం రేవంత్ చెప్పిన గడువు సోమవారంతో ముగియగా చివరి రైతు వరకు భరోసా డబ్బులు పడాలంటే మళ్లీ వానకాలం వరకు ఆగాల్సిందేనా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ నాన్చివేత ధోరణిపై రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. నాట్ల సమయంలో ఇవ్వాల్సిన పెట్టుబడిసాయం కోతలు పూర్తవుతున్నా పూర్తి చేయకపోవడం రైతులను మోసం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.