– కోదాడలో రాజేశ్ కుటుంబానికి పరామర్శ
కోదాడ, నవంబర్ 25 : రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి రాక్షస పాలన కొనసాగుతుందని, రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ చట్టంలోని నిబంధనలను బేఖాతరు చేసి కాంగ్రెస్ నేతలు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం కోదాడలో కర్ల రాజేశ్ తల్లి లలితమ్మ, ఇతర కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి రాజేశ్ చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కొనసాగేది ప్రజా పాలన కాదని.. ప్రజా ప్రతీకార పాలన.. పోలీసు రాజ్యమని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి అనుచరులు మంత్రి సురేఖ ఓఎస్డీ సుమంత్ తో కలిసి దక్కన్ సిమెంట్ యజమానులను గన్నుతో బెదిరిస్తే వారిని కాపాడేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీపీకి లేఖ రాయగా రాత్రికి రాత్రే మంత్రి ఉత్తమ్, సీఎం రేవంత్‌లు టాస్క్‌ఫోర్స్ పోలీసులను మంత్రి సురేఖ ఇంటికి పంపించిన విషయం వాస్తవం కాదా ఆయన ప్రశ్నించారు. అయినప్పటికీ సుమంత్ ని అరెస్ట్ చేయలేదన్నారు.
అలాంటప్పుడు చేయని నేరానికి అకారణంగా ఐదు రోజులు కర్ల రాజేశ్ పోలీసుల రిమాండ్‌లో ఉంటే ఈ నియోజకవర్గానికి బాధ్యత వహించే మంత్రి ఉత్తమ్ ఎందుకు లేఖ రాయలేదని ఆయన విమర్శించారు. డిసి బసు కేసును అనుసరించి కేసు తీర్పు ప్రకారం రాజేశ్ తల్లిని తన కుమారుడితో ఎందుకు కలవనీయలేదని ఐదు రోజుల పాటు నిందితుడిని పోలీస్ స్టేషన్లో ఉంచకూడదని వారికి తెలియదా అన్నారు. ఆర్టికల్ 21 ప్రకారం రాజేశ్‌ని ఎందుకు కాపాడలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో పేదల జీవితాలు లాకప్‌లోనే తెల్లారుతున్నాయన్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ పేరు చెప్పాలని రాజేశ్‌ను పోలీసులు చిత్రహింసలు పెట్టారని అందువల్లే ఆయన మృతి చెందారన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎత్తిపోతల పథకానికి రూ.5 కోట్ల ప్రాజెక్టును రాత్రికి రాత్రే రూ.50 కోట్లకు పెంచడం అవినీతి కాక మరేమిటన్నారు. ఏమాత్రం ప్రణాళిక లేకుండా కొడంగల్ నారాయణపేట ప్రాజెక్ట్‌కు రూ.4 వేల కోట్లు కేటాయించారని ఈ అంశంలో సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదన్నారు. ఎస్ఎల్బీసీ దుర్ఘటనలో 8 మంది సజీవ సమాధి అయ్యారని, ఇందుకు మంత్రి ఉత్తమ్‌పై కేసు పెట్టలేదన్నారు. రాజేశ్‌కు నేర చరిత్ర లేదని అతనొక్కడే కుటుంబానికి ఆధారమని, త్వరలో ఇల్లు నిర్మాణం చేయిస్తానని తెలిపారు.
తన కుమారుడి ఆరోగ్యం బాగాలేదని రాజేశ్ తల్లి ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్తానని పోలీసుల ఎదుట నెత్తి నోరు బాదుకున్నప్పటికీ పోలీసులు వినలేదని, నాణ్యమైన వైద్యం అందించకుండా చంపారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆయనను అప్రూవర్‌గా తీసుకుని కేసును విచారించాల్సింది పోయి ఏకంగా చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని జీవించే హక్కును కాపాడుతానని చెబుతుంటే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రతిరోజు ప్రజా పాలన ఇందిరమ్మ పాలన అంటూ పేదలను చంపుతున్నారని, జీవించే హక్కును కాలరాస్తున్నారని మండిపడ్డారు. చేవెళ్ల సాక్షిగా దళితులను బాగా చూసుకుంటామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో వాగ్దానం చేయించి ఈరోజు ప్రాణాలు తీస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి హోం మంత్రిగా సంపూర్ణంగా విఫలమయ్యారన్నారు.

Kodada : రాష్ట్రంలో సీఎం రేవంత్ రాక్షస పాలన : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
9,292 ఎకరాల భూమిని ఆగమేఘాల మీద పాలసీ పేరుతో రూ.5 లక్షల కోట్ల కుంభకోణం చేసి ఆ భూమిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధికులకు కట్టబెట్టారన్నారు. కావాలనే రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీకి చెందిన పేద వర్గాల అధికారులను ఏసీబీ అధికారులు అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేస్తున్నారని అందులో భాగమే సూర్యాపేట ప్రాంతానికి చెందిన అంబేద్కర్ అని అధికారి అరెస్ట్ అని పేర్కొన్నారు. బడుగు వర్గాల అధికారులపై ఏసీబీ అధికారులు అక్రమ కేసులు బనాయిస్తుంటే ఆ సామాజిక వర్గాలకు చెందిన మంత్రులు అడ్లూరి భట్టి, వివేక్, రాజనర్సింహ ఏం చేస్తున్నారని దుయ్యబట్టారు. చిలుకూరు ఎస్ఐపై హత్యా నేరం కేసు నమోదు చేయాలని, రాజేశ్ మృతదేహానికి రీపోస్ట్‌మార్టం నిర్వహించాలన్నారు. గ్రేహౌండ్స్ తరహాలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో ప్రత్యేక రక్షణ దళం ఏర్పాటు చేయాలని, ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీల కోసం పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని, బాధితులకు లైసెన్స్ వెపన్స్ ఇచ్చి శిక్షణ ఇవ్వాలన్నారు. నిజాయితీ చూపిన ఎస్సీ, ఎస్టీ అధికారులకు ఆక్సిలరీ ప్రమోషన్లు ఇవ్వాలన్నారు.
రాజేశ్ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో పాటు రాజేశ్ కుటుంబానికి 5 ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, తల్లికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. రాజేశ్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలు బావ సారూప్యం కలిగిన సంఘాలతో కలిసి బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. అనంతరం ఎస్సీ, మైనార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను శాలువాలు, పూలమాలతో సత్కరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎస్కే నయీమ్, బీఆర్ఎస్ యోజన నాయకుడు బెజవాడ శ్రవణ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కర్ల సుందర్ బాబు, లలిత, భాగ్యమ్మ, ఉపేందర్ గౌడ్, జామియా, రాజేశ్, వెంకటేశ్, నయీం, షేక్ అబ్బు, షేక్.అలీమ్, షేక్.నిసార్, షేక్.మగ్దూం, షేక్.దస్తగిరి, షేక్ ఆరీఫ్, షేక్ బడేమియా, నసీరుద్దీన్, ఎస్సీ మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.