దామరచర్ల, డిసెంబర్ 6 : కేసీఆర్ ఆనవాళ్లను తుడిచేస్తామంటూ అడ్డగోలుగా నోరు పారేసుకున్న నేతలే నేడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కీర్తిని లోకానికి చాటి చెప్పక తప్పడం లేదు. దక్షిణ భారతదేశంలోనే రెండో అతిపెద్దదైన యాదాద్రి సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంటును సీఎం రేవంత్‌రెడ్డి శనివారం ప్రారంభించనున్నారు. దామరచర్ల మండలంలోని వీర్లపాలెం గ్రామ శివారులో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాటి సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టారు.
ప్లాంట్‌లో స్టేజీ-1లోని ఒకటి, రెండు యూనిట్లు పూర్తిస్థాయిలో పనులు పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధమయ్యాయి. 4,600 ఎకరాల్లో రూ.34వేల కోట్లతో 4వేల మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన మొత్తం ఐదు యూనిట్లు ఉండగా, రెండో యూనిట్ నుంచి 1,600 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తికి శ్రీకారం చుట్టనున్నారు. కేసీఆర్ పాలనలోనే 90 శాతం పనులు పూర్తిచేసుకున్న ప్లాంట్‌లో స్టేజ్-1యూనిట్లను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ప్రారంభ చిహ్నంగా అధికారులు ఇక్కడ మరొక పైలాన్‌ను నిర్మించారు.
రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు ఉండకూడదనే లక్ష్యంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పవర్‌ప్లాంటు ఏర్పాటుకు సంకల్పించి 2014లో పలు ప్రాంతాలను పరిశీలించిన అనంతరం కృష్ణపట్టెలోని దామరచర్లలో నిర్మాణానికి నిర్ణయించారు. వీర్లపాలెం పరిధిలో నిర్మాణానికి స్థల సేకరణ చేపట్టి, 2015 జూన్ 8న కేసీఆర్ స్వయంగా భూమిపూజ నిర్వహించారు. ఇంజినీరింగ్, పర్యావరణ ప్రభావ అంచనా అధ్యయనాలు 2016లో పూర్తయ్యాయి. పవర్ ప్లాంట్ ప్రతిపాదిత ప్రాంతంలో అధికంగా అడవి ఉండగా, 2015 జూలైలో అటవీ శాఖ అనుమతి లభించింది. నిర్మాణ బాధ్యతలను బీహెచ్ఈఎల్ సంస్థకు అప్పగించారు. అన్ని అనుమతుల అనంతరం తర్వాత అక్టోబర్ 2017లో పనులను ప్రారంభించారు. 2022 నవంబర్‌లో కేసీఆర్ మరోవారు ఏరియల్ సర్వే ద్వారా పనులను పరిశీలించారు.
యాదాద్రి పవర్ ప్లాంటులో ఐదు యూనిట్లు పనులు ప్రారంభించినప్పటికీ ఫేజ్-1లో రెండో యూనిట్ 90శాతం పనులను ఫాస్ట్‌ట్రాక్ ప్రాతిపదికన బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యా యి. మిగతా యూనిట్లు 70 శాతం పూర్తి చేసుకున్నా యి. యాదాద్రి పవర్ ప్లాంటుపై విశాఖ, ముంబైకి చెందిన స్వచ్ఛంద సంస్థలు ఎంజీటీలో కేసులు వేయడంతో సివిల్ పనులు మాత్రం చేసుకోవచ్చని, విద్యుత్ ఉత్పత్తి చేయవద్దని తీర్పు వచ్చింది. మరోవైపు కొవిడ్ కాలంలో రెండేండ్లు పనులు మందకొడిగా సాగాయి. కొవిడ్ కారణంగా ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన కార్మికులు వారి స్వస్థలాలకు వెళ్లిపోవడంతో జాప్యం జరిగింది.
యాదాద్రి పవర్ ప్లాంటుకు అనుసంధానంగా రైల్వే లైన్లు పూర్తయ్యాయి. విష్ణుపురం నుంచి జాన్‌పహాడ్ రైల్వే లైన్ల మీదుగా పవర్ ప్లాంటుకు ప్రత్యేకంగా రూ.100 కోట్లతో 8.5 కిలోమీటర్ల మేర రెండు రైల్వే లైన్లు నిర్మించారు. ఈ ప్రత్యేక లైన్‌ను సికింద్రాబాద్-గుంటూరు, మోటుమర్రి-జగ్గయ్యపేట మార్గాలకు అనుసంధానం చేయడంతో బొగ్గు రవాణా సులుభం అవుతున్నది. 14 ర్యాక్‌లు నిలిచేలా ప్లాంటులో ట్రాక్‌లు ఏర్పాటు చేశారు. సింగరేణి నుంచి వ్యాగన్లతో బొగ్గును ప్లాంటుకు తీసుకువస్తున్నారు. నవంబర్ 2న మంత్రులు బట్టి విక్రమార్క బొగ్గు రైలు బోగీని ప్రారంభించారు.
పవర్ ప్లాంటులో స్టేజ్-1 కింద మొదటి, రెండో యూనిట్లు, స్టేజ్-2 కింద 3, 4, 5 యూనిట్లను తీసుకున్నారు. స్టేజ్-1లోని యూనిట్ల నిర్మాణం పూర్తవగా, బొగ్గుతో యూనిట్లను నడుపుతున్నారు. రోజూ 500 యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ గ్రిడ్ల ద్వా రా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. ప్లాంటుకు అనుసంధానంగా పవర్ ట్రాన్స్మిషన్లు ఏర్పాటు చేశారు. చౌటుప్పల్, డిండి, మహేశ్వరం, జనగాంలో డబుల్ సర్యూట్ 400 కేవీ ట్రాన్స్మిషన్ లైన్ ఇంటర్ కనెక్టింగ్ సబ్స్టేషన్ల ద్వారా జాతీయ గ్రిడ్లకు తరలిస్తారు. ప్లాంటుకు అవసరమయ్యే నీటి కోసం అడవిదేవులపల్లి మండలంలోని టేల్పాంట్ బ్యాక్ వాటర్ నుంచి 22 కిలోమీటర్ల పైపులైన్ వేశారు. పవర్ ప్లాంట్ సమీపంలో 10 వేల మంది కార్మికులు, ఉద్యోగులు నివాసం ఉండేందుకు 100 ఎకరాల్లో కాలనీ నిర్మిస్తున్నారు.
యాదాద్రి పవర్ ప్లాంటును సీఎం రేవంత్‌రెడ్డి శనివారం ప్రారంభించనున్నారు. విద్యుత్ సరఫరాను గ్రిడ్‌కు అనుసంధానం చేయనున్నారు. సీఎంతోపాటు మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొనున్నారు. అధికారులతో సీఓం సమీక్ష నిర్వహించి ప్లాంటు వివరాలను తెలుసుకుంటారు.