అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దూసుకుపోతున్నదని, సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సంక్షేమ సంబురాలను పురస్కరించుకొని శుక్రవారం నకిరేకల్‌లో రెండో విడుత గొర్రెల పంపిణీని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ సాటిలేని అభివృద్ధి, సంక్షేమాన్ని అందిస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వమే రాష్ర్టానికి శ్రీరామరక్ష అన్నారు. ఎమ్మెల్యేలుగా గెలువలేని నల్లగొండ కాంగ్రెస్ నేతలు సీఎం అభ్యర్థులమని చెప్పుకొంటున్నారని, దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న కేసీఆర్ పాలనపై కాంగ్రెస్ నేతలు సిగ్గుఎగ్గూ లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. అనేక సంక్షేమ కార్యక్రమాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైందని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఏ మూలకు వెళ్లినా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చెప్పుకొనే ధైర్యం తమకు ఉందన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు వంటి కార్యక్రమాలను ప్రధాని మోదీ ఆయన సొంత రాష్ట్రం గుజరాత్లో చూపించగలడా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో దళారులు, పైరవీకారులకు తావు లేకుండా అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయని చెప్పారు.
– నల్లగొండ ప్రతినిధి, జూన్ 9 (నమస్తే తెలంగాణ)/నకిరేకల్
నల్లగొండ ప్రతినిధి, జూన్ 9 (నమస్తే తెలంగాణ)/ నకిరేకల్ : ‘నలభై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం చేసిందేమీ లేదు. అభివృద్ధి, సంక్షేమాల్లో అది ఫెయిల్యూర్ పార్టీ. ఆ పార్టీ నేతలు సైతం ఫెయిల్యూర్ నేతలు.’ అని రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న సీఎం కేసీఆర్ పాలనపై కాంగ్రెస్ నేతలు సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలుగా గెల్వలేని నల్లగొండ కాంగ్రెస్ నేతలు సీఎం అభ్యర్థులమని చెప్పుకొంటున్నారని ఎద్దేవా చేశారు. ఎవరెన్ని చెప్పినా అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వమే రాష్ర్టానికి శ్రీరామ రక్ష అని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ర్ట దశాబ్ది ఉత్సవాల సంక్షేమ సంబురాల్లో భాగంగా నకిరేకల్ పట్టణంలో శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వంద యూనిట్ల గొర్రెలను లబ్ధిదారులకు మంత్రులు అందజేశారు.
అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ గొల్ల, కురుమల ఆత్మగౌరవాన్ని కాపాడే వ్యక్తిగా సీఎం కేసీఆర్‌ను కుల దైవం కొమురెల్లి మల్లన్న రూపంలో చూసుకుంటున్నామని చెప్పారు. ఆర్థికంగా భారమైనా అడగక ముందే గొర్రెల పంపిణీ పథకాన్ని సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతంగా తయారైందని, దశాబ్దాలుగా నల్లగొండలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు ఎందుకు 24 గంటల కరెంటు, తాగడానికి నీళ్లు, చెరువుల పునరుద్ధరణ, కృష్ణా, గోదావరి నీళ్లు, రెండు వేల పింఛన్, ఆడబిడ్డ పెండ్లికి లక్ష రూపాయలు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఏండ్ల తరబడి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉండి ఏమీ చేయలేక నేడు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఏ మూలకు వెళ్లినా తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చెప్పుకొనే ధైర్యం తమకు ఉన్నదన్నారు. ప్రతి గ్రామపంచాయతీకి ఒక ట్రాక్టర్, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు.. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను సొంత రాష్ట్రం గుజరాత్లో చూపించగలవా అని ప్రధాని మోదీని ప్రశ్నించారు. దళారులకు, పైరవీకారులకు తావు లేకుండా ప్రతి సంక్షేమ కార్యక్రమం నేరుగా ప్రజలకు చెందుతున్నదన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కుల వృత్తులకు ఆర్థిక ప్రోత్సాహకం అందిస్తున్నామని చెప్పారు. గొర్రెల పెంపకంలో భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు.
నకిరేకల్‌లో చిరుమర్తి లింగయ్యను గెలిపించామని చెప్పుకొంటున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండలో ఎందుకు గెల్వలేదని ప్రశ్నించారు. నకిరేకల్‌ను అద్భుతంగా అభివృద్ధి చేస్తున్న చిరుమర్తి లింగయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రస్తుతం నల్లగొండను గొప్పగా అభివృద్ధి చేస్తున్న భూపాల్‌రెడ్డిని కాదని, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఎందుకు మళ్లీ గెలిపిస్తారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలనే ప్రజలు గెలిపించుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మొదట నకిరేకల్‌లో నిర్వహించినందుకు సీఎం కేసీఆర్‌కు, మంత్రులకు గొల్ల కురుమలు రుణపడి ఉంటారన్నారు. బడ్జెట్లో రూ.12వేల కోట్లు పెట్టి మొదటి విడుతలో ఐదున్నర వేల కోట్లు, రెండో విడుతలో రూ.6వేల కోట్లతో మూడున్నర లక్షల మందికి 75 లక్షల గొర్రెలు అందిస్తున్న ఈ స్కీమ్ గొల్ల కురుమలకు ఒక వరమని పేర్కొన్నారు. జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ప్రభుత్వాలు కుల వృత్తులను పట్టించుకోకపోవడంతో అనేక కుటుంబాలు నిరాదరణకు గురయ్యాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కుల వృత్తులను ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు చేపల పెంపకం వంటి పథకాలను ప్రవేశపెడుతున్నారన్నారు.
షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గొల్ల, కురుమ కుటుంబాలను ఆదుకునేందుకు, ఆర్థిక స్వావలంబన కల్పించాలనే ఉద్దేశంతో గొర్రెల పంపిణీ చేస్తున్నారన్నారు. దళారుల ప్రమేయం లేకుండా కలెక్టర్ పరిధిలో పకడ్బందీగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు నకిరేకల్ మెయిన్ సెంటర్ నుంచి మినీ స్టేడియం వరకు డప్పు వాయిద్యాలతో ర్యాలీ నిర్వహించారు. రామన్నపేట, చిట్యాల, నార్కట్‌పల్లి, కట్టంగూర్, కేతేపల్లి, నకిరేకల్ మండలాల నుంచి గొల్ల, కురుమలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో కలెక్టర్ వినయ్‌క్రిష్ణారెడ్డి, ఎస్పీ అపూర్వరావు, విజయ డెయిరీ చైర్మన్ సోమ భరత్‌కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, నకిరేకల్, చిట్యాల మున్సిపల్ చైర్మన్లు రాచకొండ శ్రీనివాస్ గౌడ్, కోమటిరెడ్డి చిన వెంకట్‌రెడ్డి, ఎంపీపీలు బచ్చుపల్లి శ్రీదేవి, జ్యోతి, కొలను సునీత, సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, జెల్ల ముత్తిలింగయ్య, పెరుమాళ్ల శేఖర్, జడ్పీటీసీలు మాద ధనలక్ష్మి, తరాల బలరాం, పున్న లక్ష్మి, సుంకరి ధనమ్మ, బొప్పని స్వర్ణలత, ఏఎంసీ చైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు, అన్ని మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష
అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్లలా ఏకకాలంలో అద్భుతంగా అమలు చేస్తూ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వమే రాష్ర్టానికి శ్రీరామ రక్ష అని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. వ్యవసాయ రంగంలో 2014కు ముందు 40లక్షల మెట్రిక్ టన్నులకు మించని ధాన్యం సేకరణ నేడు 1.40 కోట్ల మెట్రిక్ టన్నులకు చేరిందని.. ఇదే కదా అభివృద్ధి అన్నారు. నల్లగొండ జిల్లా నేడు 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణతో దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తున్నదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతలే ఫెయిల్యూర్ అని, 24 గంటల కరెంటు, ఇంటింటికీ తాగునీళ్లు, ప్రతి ఎకరాకు సాగునీరు ఇలా ఎన్నో పథకాలు అమలు చేస్తున్న తమను విమర్శించే హక్కు వారికి లేదని అన్నారు. గతంలో మృగశిర కార్తెకు ఒక్క చేప కూడా దొరుకని పరిస్థితి ఉండేదని, తెలంగాణ రాష్ట్రంలో చెరువులు చేపలతో కళకళలాడుతున్నాయని, ఎందరో మత్స్యకారులు జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. సంక్షేమ రంగంలో దాదాపు రూ.65 వేల కోట్లు ఖర్చు పెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. 46 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఆకలి కేకలు లేవు, మంచినీళ్ల కష్టాలు లేవని.. గుజరాత్ సహా ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకాలు లేవని విమర్శించారు. నల్లగొండ జిల్లాలో పెద్ద మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్‌ను ప్రజలు ఇప్పటికే రాజకీయ నిరుద్యోగులుగా మార్చారని ఎద్దేవా చేశారు. 2014కు ముందు నాటి పరిస్థితులను, ప్రస్తుత పరిస్థితులను పోల్చుకుంటూ జిల్లా ప్రజలు స్పష్టంగా ఉన్నారని, మరోసారి సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
100 యూనిట్ల గొర్రెల పంపిణీ
నకిరేకల్, జూన్ 9 : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నకిరేకల్‌లోని మినీ స్టేడియంలో రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మెడికల్ కిట్లు అందజేసి లబ్ధిదారులతో మాట్లాడారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి రామన్నపేట, చిట్యాల, నార్కట్‌పల్లి, కట్టంగూర్, కేతేపల్లి, నకిరేకల్ మండలాల నుంచి గొల్ల, కురుమలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నకిరేకల్ మెయిన్ సెంటర్ నుంచి మినీ స్టేడియం వరకు డప్పు వాయిద్యాలతో ర్యాలీగా చేరుకున్నారు. అంతకుముందు మంత్రి తలసాని నకిరేకల్ మండలంలోని పాలెం గ్రామంలో గల కూర్మగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అభివృద్ధి కోసమే నిరంతర తపన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
సీఎం కేసీఆర్ నాయకత్వంలో నకిరేకల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నానని చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో గొల్ల కురుమలకు, ముదిరాజ్, గౌడ సోదరులకు ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి సహకారంతో ఉదయ సముద్రం ప్రాజెక్టు పూర్తి చేసుకుంటున్నామన్నారు. అయిటిపాముల లిఫ్ట్, వంద పడకల ఆస్పత్రి, రోడ్ల విస్తరణ, మౌలిక వసతుల కల్పన, గ్రామాల్లో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. అభివృద్ధి కోసమే బీఆర్ఎస్లో చేరానని, ప్రాణం ఉన్నంత వరకు సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డి నాయకత్వంలో ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. తనకు ప్రజాభిమానమే ముఖ్యమని, ఆస్తులు ముఖ్యం కాదన్నారు. కొందరు దుర్మార్గులు ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని, అలాంటి వారి పట్ల అప్రమత్తతతో ఉండాలని ప్రజలకు సూచించారు. నర్రా రాఘవరెడ్డి మాదిరిగా నిరంతరం ప్రజల కోసమే పని చేస్తానని, నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని పేర్కొన్నారు.