ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. శనివారం వారికి శాఖల కేటాయింపు జరిగింది. హుజూర్నగర్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి నలమాద
ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి పౌరసరఫరాల, నీటిపారుదల శాఖలను కేటాయించారు. నల్లగొండ నుంచి ప్రాతినిథ్యం
వహిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి రహదారులు, భవనాల శాఖను కేటాయించారు.
వాస్తవంగా వీరిద్దరిలో ఒకరికి హోంశాఖ, మరొకరికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ వస్తుందని ముందస్తు ప్రచారం జరిగింది. కానీ.. వారు ఆశించిన శాఖలు కాకుండా ఇతర శాఖలు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. ఆదివారం ఉదయం 9గంటలకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆర్ అండ్ బీ శాఖ మంత్రిగా బాధ్యతలు
చేపట్టనున్నారు. కాగా, జిల్లా నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన 12 మంది శనివారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు.
నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఇద్దరూ మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. వారిద్దరికీ శనివారం శాఖల కేటాయింపు జరిగింది. హుజూర్నగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి పౌర సరఫరాల శాఖతో పాటు నీటి పారుదల శాఖను కేటాయించారు. నల్లగొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి రహదారులు, భవనాల శాఖను కేటాయించారు.
వాస్తవంగా వీరిద్దరిలో ఒకరికి హోంశాఖ మరొకరికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ వస్తుందని ముందస్తు ప్రచారం జరిగింది. కానీ వీరు ఆశించిన శాఖలు గాక ఇతర శాఖల కేటాయింపు చర్చనీయాంశంగా మారింది. అయితే ఆదివారం ఉదయం 9గంటలకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆర్అండ్బీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు ముహుర్తం ఖరారైంది. దీంతో ఆదివారం నాటి వెంకట్‌రెడ్డి పర్యటన వాయిదా పడింది. కాగా జిల్లా నుంచి శాసనసభ్యులుగా గెలుపొందిన 12మంది శనివారం అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేశారు.
ఈ నెల 7వ తేదీన సీఎంగా రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి శనివారం శాఖల కేటాయింపు పూర్తైంది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి నీటిపారుదల, ఆహార, పౌర సరఫరాల శాఖను కేటాయించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. ఇక కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఆర్అండ్బీ శాఖతో పాటు సినిమాటోగ్రఫీ శాఖలు కేటాయించారు. వైఎస్ హయాంలో వెంకట్‌రెడ్డికి ఐటీ, ఓడరేవుల అభివృద్ధి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
అయితే వీరిద్దరికీ ముందుగా ఇతర శాఖలు కేటాయించనున్నట్లుగా ప్రచారం జరిగింది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి హోంశాఖ, వెంకట్‌రెడ్డికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలు దాదాపుగా ఖరారైనట్లుగా ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరిగింది. వాస్తవంగా పట్టణాభివృద్ధి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖపై ఇద్దరూ ఆసక్తి చూపినట్లు తెలిసింది. అయితే వీరికి హోం, మున్సిపల్ శాఖలు కేటాయిస్తున్నట్లు ప్రచారం జరగడంతో సంబంధిత శాఖల్లోని పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అధికారులంతా వీరిని కలిసి ముందే శుభాకాంక్షలు తెలపడం గమనార్హం. కానీ అనూహ్యంగా శనివారం వీరిద్దరికీ వేరే శాఖలు కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఉమ్మడి జిల్లా నుంచి ఎన్నికైన 12మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో శనివారం పదవీ ప్రమాణ స్వీకారం చేపట్టారు. ప్రోటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఓవైసీ వ్యవహరించగా ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముందుగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం సూర్యాపేట నుంచి హాట్రిక్ విజయం సాధించిన బీఆర్ఎస్ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. జిల్లా నుంచి రెండోసారి ఎన్నికైన నలమాద పద్మావతి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, నేనావత్ బాలూనాయక్, వేముల వీరేశంతో పాటు తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, బీర్ల అయిలయ్య, మందుల సామేల్, కుందూరు జయవీర్‌రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఆర్అండ్బీ మంత్రిగా నేడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆదివారం ఉదయం 9గంటలకు సచివాలయంలోని 5వ అంతస్తులోని కార్యాలయంలో పూజ కార్యక్రమం అనంతరం అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. బాధ్యతలు చేపట్టిన అనంతరం పలు కీలకమైన ఫైల్స్‌పై సంతకం చేయనున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. వాస్తవంగా మంత్రి హోదాలో ఆదివారం వెంకట్‌రెడ్డి నల్లగొండలో పర్యటించాల్సి ఉంది. కలెక్టరేట్లో జిల్లా అధికారులతో అనంతరం నల్లగొండ మున్సిపాలిటీలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించాల్సి ఉంది. కానీ నేడు బాధ్యత స్వీకరణ నేపథ్యంలో పర్యటన వాయిదా పడింది.