చిట్యాల, డిసెంబర్ 5 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులిచ్చి పూర్తి చేసిన పనులనే సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తున్నారని, జిల్లా ప్రాజెక్టుల పూర్తికి రూపాయి నిధులివ్వని ఆయన ఆ ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి రావడం సిగ్గుచేటని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. చిట్యాలలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 7న సీఎం రేవంత్‌రెడ్డి యాదాద్రి థర్మల్ ప్లాంటు, మెడికల్ కాలేజీ, బ్రాహ్మణ వెల్లెంల ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకాల ప్రారంభోత్సవానికి వస్తున్న ఆయన తన 11 నెలల పాలనలో ఈ ప్రాజెక్టులకు ఎన్ని నిధులు కేటాయించారో ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు. జిల్లాను ఏ రకంగా అభివృద్ధి చేశారని ప్రారంభోత్సవానికి వస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
గత ప్రభుత్వ కాలంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పడు కేటీఆర్, హరీశ్‌రావు సహకారంతో అప్పటి ముఖ్యమంత్రిని ఒప్పించి నిధులు తీసుకువచ్చి లైనింగ్ పనులు పూర్తి చేశారని, తర్వాత చుట్టు ప్రక్కల గ్రామాలకు సాగు, తాగు నీరు వచ్చిందని ఆయన గుర్తు చేశారు. దాదాపు మరో రూ.500 కోట్లు కేటాయిస్తే మిగిలిన లైనింగ్ పనులను, కెనాల్లో మిగిలిన పనులను పూర్తి చేయడంతోపాటు, ల్యాండ్ అక్విజేషన్ కూడా పూర్తి అవుతుందని, అలా చేయకుండా రైతులను మోసగించడానికి కేసిఆర్ చేసిన పనులనే మళ్లీ ప్రారంభించడానికి రావడం ఎంత వరకు సమంజసమో ఆలోచించాలని తెలిపారు. లక్ష ఎకరాలకు సాగునీరందించే ఈ ప్రాజెక్టును ప్రారంభించటానికి రావడం సిగ్గుచేటని చెప్పారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో 90 శాతం పూర్తయిన నక్కలగండిని కూడా పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నక్కల గండి ద్వారా ఉదయ సుముద్రానికి 3000 క్యూసెక్కుల గ్రావిటీ వచ్చేలా చూడాలని, అందుకోసం నక్కలగండి పూర్తికి రూ. 2000 కోట్లను కేటాయించాలని చిరుమర్తి డిమాండ్ చేశారు. ఏ నిధులు కేటాయించకుండా మొక్కుబడిగా ప్రాజెక్టులను ప్రారంభించి, ఎన్నికల హామీలుగా మిగిలిస్తే శిలాఫలకాలను ధ్వంసం చేస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని, ప్రజలు గొంతు విప్పితే ఆ గొంతు నొక్కి అక్రమ కేసులు పెట్టి నిర్బంధిస్తున్నారని అన్నారు.
మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడం సిగ్గు చేటని తెలిపారు. రేవంత్‌రెడ్డి ప్రజా పాలన ఏడాది ఉత్సవాలు కాదని, నిర్బంధ పాలనకు ఏడాది పేర ఉత్సవాలు నిర్వహించుకోవాలని విమర్శించారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్య, బీఆర్ఎస్ నాయకులు కొలను వెంకటేశ్, సుంకరి యాదగిరి, కొలను సతీశ్, జిట్ట బొందయ్య, కోనేటి యల్లయ్య, ఆగు అశోక్ తదితరులు పాల్గొన్నారు.