హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఆసియాలో మంగళవారం ‘వాటర్, జెండర్ అండ్ ైక్లెమెట్’ అంశంపై జాతీయ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు కేంద్ర జల్‌శక్తిశాఖ సహాయ మంత్రి డాక్టర్ రాజ్‌భూషణ్, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే సారస్వత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘వాటర్ అండ్ జెండర్’ గ్రంథాన్ని ఆవిష్కరించారు. అనంతరం జల వనరుల ప్రాముఖ్యత, వాటిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతపై పలువురు వక్తలు వివరించడంతోపాటు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషిని కొనియాడారు.
ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు సురేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో మిషన్ కాకతీయ పథకం ద్వారా 27,665 జలాశయాలను పునరుద్ధరించడంతోపాటు మిషన్ భగీరథ పథకం ద్వారా సుమారు 55 లక్షల ఇండ్లకు మంచినీటిని అందించిందని గుర్తుచేశారు. కేసీఆర్ సర్కార్ అమలు చేసిన మిషన్ భగీరథ పథకం ఆధారంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జల్‌జీవన్ మిషన్ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ జీ సతీశ్‌రెడ్డి, మాజీ విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా, “వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా” రాజేంద్రసింగ్, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్, ఈజిప్ట్, బెల్జియం, నెదర్లాండ్స్, అరబ్ తదితర దేశాల రాయబారులు, ప్రముఖులు పాల్గొన్నారు.