రామన్నపేట, జూలై 3: రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి పాలన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలం వెల్లదీస్తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘తెలంగాణ మీ అయ్య జాగీరా అంటూ అవమానించిన వ్యక్తి కుటుంబానికి యాదగిరి ట్రస్టు బోర్డు మెంబర్ పదవి ఇవ్వడం ఇక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే’ అన్నారు.
ట్రస్టు బోర్డులో జిల్లాకు ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం అవమానకరమన్నారు. ఎండోమెంట్ శాఖ మంత్రికి తెలియకుండానే కమిటీని ప్రకటించారన్నారు. దీనిపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలకు సమధానం చెప్పాలన్నారు. చైర్మన్‌గా నియమించిన వ్యక్తి ఎవరో ప్రజలకు తెలియదన్నారు. అవినీతి ఆరోపణలపై గన్‌పార్క్ వద్ద చర్చకు రావాలని సవాల్ విసిరిన మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులను పోలీసులతో అరెస్టు చేయించి తోకముడుచుకొని పారిపోయారన్నారు.
గతంలో బకాయి పడ్డ రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయకుండా రెండుమూడు ఎకరాలకు వేస్తూ సంబురాలు చేసుకుంటే రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారన్నారు. చంద్రబాబు డైరక్షన్లో రాష్ట్రంలో పాలన సాగుతోందన్నారు. మంత్రుల మధ్య సమన్వయం లేదన్నారు. రేవంత్‌రెడ్డి మెప్పు పొందేందుకే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులపై విమర్మలు చేస్తున్నారన్నారు. రేవంత్‌రెడ్డి ఢిల్లీకి మూటలు మోస్తూ బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని తన పదవిని కాపాడుకుంటున్నారని అన్నారు.
రైతులకు సరిపడా యూరియా, ఎరువులు అందుబాటులో ఉంచాలన్నారు. పంటల మార్పిడి విషయంపై రైతులకు అవగాహన కల్పించడంలో, అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. తిరిగి కేసీఆర్ పాలన రానుందన్నారు.
సమావేశంలో బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు పోశబోయిన మల్లేశం, మాజీ జెడ్పీటీసీ తరాల బలరాం, సర్పంచ్ గర్దాసు విక్రం, మాజీ ఎంపీటీసీలు వేమవరపు సుధీర్‌బాబు, పున్న వెంకటేశం, నాయకులు కన్నెబోయిన బలరాం, బత్తుల వెంకటేశం, జాడ సంతోశ్, అమేర్, నక్క నరేందర్ తదితరులు పాల్గొన్నారు.