నకిరేకల్ : తెలంగాణ బానిస సంకెళ్లను తెంపి మనకు స్వేచ్ఛా స్వాతంత్రాన్ని సాధించిన పార్టీ బీఆర్ఎస్ అని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నకిరేకల్ పట్టణ కేంద్రంలో పార్టీ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను సంరక్షించింది బీఆర్ఎస్ పార్టీయేనని స్పష్టం చేశారు. పదేండ్లు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపి దేశానికి దిక్సూచిగా నిలిపింది బీఆర్ఎస్ పార్టీ.
బీఆర్ఎస్ పార్టీ లేకుండా తెలంగాణను ఊహించలేమన్నారు. నేడు వరంగల్లో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజల నుంచి వస్తున్న అపూర్వమైన ఆదరణను చూసి జడుసుకున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఫేక్ ప్రచారాలకు ఒడిగట్టాయి. ఈ సభ తప్పకుండా విజయవంతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కేసీఆర్ ప్రవేవపెట్టిన పథకాలను కూడా అమలు చేయలేకపోతున్నదని విమర్శించారు. ఎవరు అవునన్నా కాదన్నా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు.