నీలగిరి, మే 7 : అధికార మదం, అహంకారంతో మాట్లాడితే ఊరుకునేది లేదని, తగిన గుణపాఠం చెబుతామని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హెచ్చరించారు. గురువారం నల్లగొండ బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేటీఆర్, హరీశ్‌రావుపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. దొంగ ఉద్యమాలు, నకిలీ నక్సలైట్‌గా ఉన్న ఎమ్మెల్యే వీరేశానికి రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులేనని పేర్కొన్నారు. వారిని విమర్శించే స్థాయి వీరేశానిది కాదన్నారు. రాష్ట్రం లో కాంగ్రెస్ నాయకుల భాష చాలా దారుణంగా ఉంటోందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న నాయకులపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దోచుకోవడం, దాచుకోవడమే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.
కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరిస్తున్నందుకే కేటీఆర్, హరీశ్‌రావులపై కాంగ్రెసోళ్లు విమర్శలు చేస్తున్నారన్నారు. భూ కబ్జాలు, రౌడీ రాజకీయాలు, హత్యా రాజకీయాలను ప్రోత్సహించే ఎమ్మెల్యేలకు విప్ పదవులు ఇచ్చి కేవలం బీఆర్ఎస్ నాయకులనే విమర్శించాలని సీఎం ఆదేశాలు ఇచ్చారన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులను దూషించడం, వారిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడటమే విప్ల పని అన్నారు. తన రాజకీయ మనుగడ కోసం యువత జీవితాలను ఆగం చేసిన చరిత్ర వీరేశానిదన్నారు. గంజాయి సాగును ప్రోత్సహిస్తూ నియోజకవర్గంలో తన ఎదుగుదల కోసం ముక్కుపచ్చలారని యువకులను బానిసలుగా చేసుకుంటున్న నీచుడు వీరేశం అన్నారు. బలుపు మదంతో మాట్లాడుతున్నాడని విమర్శించారు. పోలీ సు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని ఇసుక, మట్టి, గంజాయి అక్రమ రవాణాను ప్రోత్సహిస్తూ కోట్లాది రూపాయలు దోచుకున్న ఘరాన దొంగ అని అన్నారు. నకిలీ నక్సలైట్ పేరుతో దొంగ ఉద్యమాలు చేసి అడ్డదారిలో సీటు పొంది ఎమ్మెల్యే అయ్యాడని విమర్శించారు. పెద్ద నాయకులపై విమర్శలు చేస్తే పెద్ద నాయకుడు కాలేరని, ఎవరి చరిత్ర ఎంటో అందరికీ తెలుసన్నారు.
నియోజకవర్గానికి తాను ఎమ్మెల్యే ఉన్నప్పుడు తెచ్చిన నిధులే తప్ప ఈ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే పైసా నిధులు తేలేదన్నారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలకు వెల్లంల నీరు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. పక్క నియోజకవర్గాలకు నీరు తీసుకెళ్తుంటే తన నియోజవర్గంలో ప్రాజెక్టు ఉండి కూడా ఏమీ చేయలేని అసమర్థ ఎమ్మెల్యే వీరేశం అన్నారు. జిల్లా పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న బెదిరింపులు, భూ కబ్జాల్లో ఎమ్మెల్యే హస్తం ఉందని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలన్నారు.
ఉద్యమ నాయకుడు హరీశ్‌రావును విమర్శించే స్థాయి ఆలేరు ఎమ్మెల్యే అయిలయ్యకు లేదని, హరీశ్‌రావు లాంటి వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని చిరుమర్తి హెచ్చరించారు. హరీశ్‌రావుని విమర్శిస్తే మంత్రి పదవి ఇస్తారన్న అపోహలో అయిలయ్య ఉన్నట్లుందని, ఆయన భూ దందాల గురించి గుట్ట ప్రాంత ప్రజలకు బాగా తెలుసన్నారు. రికార్డులో అయిలయ్య కుటుంబ సభ్యుల పేరిట కేవలం మూడు గ్రామాల్లోనే 250 ఎకరాల భూమి ఎలా వచ్చిందని, సీఎంకు దమ్ముంటే ఈ భూ దందాలపై ఈడీ, సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పలువురు నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.