నకిరేకల్, నవంబర్ 6: రెండేండ్ల కిందట బాండు పేపర్లు రాసిచ్చి, గ్యారంటీ కార్డులిచ్చి, దేవుళ్లపై ఒట్లు పెట్టి..అత్తకు నాలుగు వేలు..కోడలికి రెండున్నర వేలు ఇస్తామన్న హామీలు ఎక్కడికి పోయాయి..రేవంత్‌రెడ్డి..ఆడబిడ్డలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ విజయాన్ని కాంక్షిస్తూ గురువారం బోరబండ డివిజన్లోని 314, 315, 316 బూత్‌ల్లో చిరుమర్తి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్ధరించిందేమీ లేదన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసగించిందని విమర్శించారు.
పెండ్లి చేసుకున్న ఆడబిడ్డలకు రూ.లక్షతో పాటు తులం బంగారం, వితంతువులకు, వృద్ధ మహిళలకు డబుల్ పింఛన్ హామీ, యువతులకు స్కూటీలు..ఇలా ఆడబిడ్డలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయన్నారు. జూబ్లీహిల్స్‌లో గెలిచిన మాగంటి గోపీనాథ్ ఇక్కడి ప్రజలకు ఎంతగానో మేలుచేశారన్నారు. భర్తను తలుచుకొని భావోద్వేగంతో సునీతమ్మ కన్నీళ్లు పెడితే కాంగ్రెస్ మంత్రులు అపహాస్యం చేయ డం దారుణమన్నారు. సునీతమ్మ కన్నీళ్లను వెక్కిరించిన కాంగ్రెస్ నేతలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కారు గుర్తుకు ఓటువేసి ఆమెను ఎమ్మెల్యేగా గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.