నల్లగొండ, డిసెంబర్ 13: స్థానిక సంస్థల ఎన్నికల్లో నకిరేకల్ నియోజక వర్గంలో అధికార పార్టీ నేతలు ఎన్నో అరాచకాలకు పాల్పడుతున్నా కలెక్టర్, ఎస్పీలు నోరు మొదపడటంలేదని నకిరేకల్ మాజీ శాసన సభ్యుడు చిరుమర్తి లిం గయ్య ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన స్థానిక బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. నేరుగా ఎమ్మెల్యే వేముల వీరేశం పోలీసులకు, ఎన్నికల అధికారులకు ఫోన్లు చేసి తమకు అనుకూలంగా పనులు చేయించుకుంటూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. బయట నుంచి రౌడీ మూకలను దింపి బెదిరింపులకు దిగుతున్నట్లు ఆరోపించారు.
నార్కట్పల్లిలో అభ్యర్థులు కనీసం ప్రచారం చేసుకునే అవకాశం కూడా కల్పించలేదని..స్థానిక ఎస్ఐ క్రాంతి కాంగ్రెస్ కార్యకర్తలా వ్యవహరించి, బీఆర్ఎస్ అభ్యర్థులను బెదిరించినట్లు తెలిపారు. కేతేపల్లి, చినకాపర్తి, తాళ్ల వెల్లంల, ముత్యాలమ్మ గూడెంలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తారనే భయంతో దౌర్జన్యాలకు దిగినట్లు ఆరోపించారు. కౌంటింగ్ సమయం లో బీఆర్ఎస్ కార్యకర్తలు లేకుండానే అధికారులు కౌంటింగ్ చేపట్టి ఏకపక్షంగా కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచినట్లు ప్రకటించారన్నారు. చినకాపర్తిలో రీపోలింగ్ నిర్వహించాలన్న ఆయన దీనిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి కోర్టుకు వెళ్తామన్నారు. చిన్న నారాయణ పురం తోపాటు కొర్లపహాడ్లో తమ కార్యకర్తలపై దాడులు చేసి గాయపరిచినా పోలీసులు కేసులు నమోదు చేయకపోవటం దారుణమన్నారు.