chirumarthi lingaiah | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు మీద ఉన్న ప్రేమ తెలంగాణ రైతన్న మీద కానీ, నల్గొండ జిల్లా రైతుల మీద గానీ లేదని స్పష్టంగా కనబడుతున్నదని, చంద్రబాబునాయుడు ఆంధ్రకు నీళ్లు తరలిస్తుంటే రేవంత్ రెడ్డి కానీ, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ చేతులు కట్టుకొని చూశారే..? తప్ప ఏ విధమైన స్టేట్మెంట్ ఇచ్చిన దాఖలు లేవని, రుణమాఫీపై ముఖ్యమంత్రి, మంత్రులు తాగుబోతుల కంటే హీనంగా మాట్లాడుతున్నారని నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు.
నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రెండు లక్షలు ఆపై పంట రుణం తీసుకున్న వారికి చిత్తశుద్ధితో బాధ్యత యుతంగా రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలు చాలా సందర్భాల్లో చెప్పారని గుర్తు చేశారు. కానీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రెండు లక్షలు ఆపైన పంట రుణం తీసుకున్న వారికి రుణమాఫీ చేయబోమని తేల్చి చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు.
ఎందుకు రుణమాఫీ చేయలేదు..
42 లక్షలు మంది రైతులు బ్యాంకులో అప్పులు తీసుకుంటే కేవలం 25 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేశారని, మిగిలిన 16 లక్షల పైబడిన రైతులకు ఎందుకు రుణమాఫీ చేయలేదని ప్రశ్నించారు. మిగిలిన 16 లక్షలకు పైగా రైతులకు ఇవ్వాల్సిన రూ.10000 కోట్లు ఎవరు మింగినట్లు ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. పోయిన సంవత్సరం విస్తారంగా వర్షాలు పడినప్పుడు నల్గొండ జిల్లాలోని చెరువులు, కుంటలు నింపితే పంటలు ఎండిపోయే పరిస్థితి ఉండేది కాదన్నారు.
ఎండిపోయిన పంటలను వెంటనే పరిశీలించి ఎకరానికి రూ.50,000 నష్టపరిహారం అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించేంతవరకు బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రదీప్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు నవీన్ రావు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Hyderabad | ఎస్టీ హాస్టల్లో పురుగుల అన్నం.. రోడ్డెక్కిన విద్యార్థులు