DK Shiva Kumar : నియోజవర్గాల పునర్విభజనపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (ML Stalin) అధ్యక్షతన జరిగిన జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై (Annamalai) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అన్నామలై వ్యాఖ్యలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) స్పందించారు. అన్నామలై రాష్ట్రానికి కాకుండా తన పార్టీకి విధేయుడిగా ఉన్నారని విమర్శించారు. ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
స్టాలిన్ నేతృత్వంలో జేఏసీ సమావేశం జరుగుతున్న సమయంలో పార్టీ నేతలతో కలిసి అన్నామలై నిరసన వ్యక్తం చేశారు. కేరళ, కర్ణాటక రాష్ట్రాలపై ఆరోపణలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందంటూ అనవసర రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు. దాంతో అన్నామలైకి రాష్ట్ర విషయాల కంటే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలు ముఖ్యమని విమర్శించారు.
శనివారం జేఏసీ సమావేశంలో స్టాలిన్ మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటు స్థానాలు తగ్గించడం ద్వారా రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని కుదించేందుకు అనుమతిస్తే.. మాతృదేశంలోనే రాజకీయ అధికారంలేని పౌరులుగా మారిపోతామని హెచ్చరించారు. తమ పోరాటం పునర్విభజనకు వ్యతిరేకం కాదని, న్యాయంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాలని కోరుకుంటున్నామని చెప్పారు.