చిట్యాల, సెప్టెంబర్ 4: రాష్ట్రంలో దళారీ ప్రభుత్వం నడుస్తోందని, రైతులకు యూరి యా దొరకకుండా బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని, ఇచ్చిన హామీలను ప్రజలు మరిచిపోయేలా చేయడానికే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ అంటూ ప్రభుత్వం నాటకాలు ఆడుతుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. గురువారం చిట్యాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులకు సరిపడా యూరియాను వెంటనే అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎక్కడా యూరి యా కోసం రైతులు వేచి ఉన్నది లేదని, ఆటో డ్రైవర్లకు డబ్బులు ఇస్తే వారే షాపుల నుంచి వ్యవసాయ పొలాల వరకు యూరియాను చేరవేసేవారన్నారు. కానీ, ఇప్పుడు రైతులు రోజుల తరబడి పీఏసీఎస్ సెంటర్లు, ఎరువుల షాపుల వద్ద నిరీక్షించినా యూరియా దొరకని పరిస్థితి నెలకొన్నదని విమర్శించారు. చేతగాని ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని విమర్శించి కేసీఆర్ను బద్నాం చేయడమే పనిగా పెట్టుకుందన్నారు.
సీఎం రేవంత్రెడ్డి మాదిరిగానే ఆ ప్రభుత్వంలోని మరి కొంతమంది నాయకులు కమీషన్లకు, అక్రమ సంపాదనకు కక్కుర్తి పడి ప్రజా సంక్షేమాన్ని విమర్శించారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ వేసినా..అందులో గడ్డిపోచంత కూడా అక్రమం జరిగినట్లు తేలలేదన్నారు. తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ జాతిపిత కేసీఆర్ ఆణిముత్యంలాగా బయటకు వస్తారని చిరుమర్తి పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభు త్వ పాలనలో ఎక్కడా ప్రజా సంక్షేమం కనిపించడం లేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎప్పటికప్పుడు ప్రజలను మభ్యపెట్టడానికి సరికొత్త ఎత్తులు వేస్తూ బీఆర్ఎస్ను, కేసీఆర్ను బద్నాం చేయడానికి కాంగ్రెసోళ్లు ప్రయత్నిస్తున్నారని చిరుమర్తి ఆరోపించారు. ఇది దగాకోరు ప్రభుత్వమని, తప్పుడు హామీలు, తప్పుడు మాటలతో కాలం వెళ్లదీస్తుందని ఎద్దేవా చేశారు. అనంతరం రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని కోరుతూ డిప్యూటీ తహాసీల్దార్ విజయకు మెమోరాండం సమర్పించారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాచకొండ కృష్ణయ్య, కూరెళ్ల లింగస్వామి, కొలను వెంకటేశ్, దేవరపల్లి సత్తిరెడ్డి, కల్లూరి మల్లారెడ్డి, పొన్నం లక్ష్మయ్య, కొయగుర నరసింహ, ఆగు అశోక్, రుద్రారపు బిక్షపతి, జనగాం నరసింహ, నరసింహ, గుంటోజు యాదగిరి, మేడి ఉపేందర్, రవీందర్, చిత్రగంటి ప్రవీణ్, జిట్టా శేఖర్ తదితరులు పాల్గొన్నారు.