నల్లగొండ, మార్చి 26 : పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ అయిన విషయం పేపర్లతో పాటు టీవీల్లో రావడం వల్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వ వైఫల్యాన్ని ట్విట్టర్ వేదికగా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్య అని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నల్లగొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పేపర్ లీక్ చేసే ధైర్యం నకిరేకల్‌లో ఎవరికీ లేదని, ఎమ్మెల్యే అండతోనే కాంగ్రెస్ పార్టీ నేతలు పేపర్‌ను లీక్ చేశారని అన్నారు.
ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యంతో చీకటి ఒప్పందం చేసుకొని ఆ దుశ్చర్యకు పాల్పడినట్లు ఆరోపించారు. పేపర్లో వచ్చిన దాన్ని ఒక పార్టీ అధినేతగా ప్రశ్నించటం కూడా తప్పేనా అని అన్నారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని తెలిపారు. ఎమ్మెల్యే వీరేశం తన అనుచరులైన నరేందర్, రజిత, ఉగ్గిడి శ్రీనివాస్‌లతో ఈ కేసులు ఉద్దేశపూర్వకంగానే పెట్టించారని, ఆయన ఆదేశం లేకుండా వారు ఇలాంటి కేసులు పెట్టరని చెప్పారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి ఎన్నో అక్రమాలు, దందాలు, భూ కబ్జాలు చేయిస్తూ ఒక్కో కేసులో లక్షల్లో వసూలు చేసి డబ్బులు పోగేసుకుంటున్నట్లు విమర్శించారు.
అడవిలో ఉన్న ఆయన్ను తీసుకొచ్చి కేసీఆర్ ఎమ్మెల్యేగా అవకాశమిస్తే, ఇవ్వాల తనకు భిక్ష పెట్టిన వాళ్లనే ఎదురించే స్థాయికి వచ్చారని, కేటీఆర్‌పైనే కేసులు పెట్టి కుట్ర చేస్తున్న ఆయన్ను ప్రజలు క్షమించబో రని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడం వల్లే బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని, కేసులకు భయపడకుండా న్యాయ వ్యవస్థతో పోరాడుతూ ప్రజాక్షేత్రంలో వారికి శిక్ష వేయిస్తామని తెలిపారు. నకిరేకల్‌లో కొందరు పోలీసులు, అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ నేతలను ఇబ్బంది పెడుతున్నారని, వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నల్లగొండ పట్టణాధ్యక్షుడు బోనగిరి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.