నకిరేకల్, నవంబర్ 1 : ‘అధికారంలోకి రాగానే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు పింఛన్లను పెంచుతామని కాంగ్రెస్ మాయమాటలు చెప్పి 22 నెలలైంది. పింఛన్లు పెంచని కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధి చెప్పాలి. మన ఆడబిడ్డ మాగంటి సునీతమ్మ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి’ అని మాజీ ఎమ్మెల్యే, వినాయకరావు నగర్ బీఆర్ఎస్ ఇన్‌ఛార్జి చిరుమర్తి లింగయ్య కోరారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్ 314, 315, 316 బూత్‌లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతగోపినాథ్ విజయాన్ని కాంక్షిస్తూ చిరుమర్తి లింగయ్యతో పాటు బీఆర్ఎస్ నాయకులు శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలప్పుడు తాము అధికారంలోకి రాగానే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఇస్తున్న రూ.2016 పింఛన్ రూ.4016లకు, దివ్యాంగులకు పింఛన్ రూ.6,016లకు పెంచుతామని కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చి మళ్లీ ఓట్ల కోసం తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మాటలు నమ్మి ఓటేసి గెలిపించిన ఆసరా పింఛన్‌దారులకు పింఛన్ పెంచుతారన్న ఆశే లేకుండా పోయిందన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పింఛనుదారుల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతమ్మ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించుకోవాలని కోరారు. బీఆర్ఎస్ డివిజన్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.