నేరేడుచర్ల, మే 12: చెరువులు, కుంటలు ఆనవాళ్లు కోల్పోతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఆక్రమణకు గురవుతు న్న చెరువును కాపాడాలని ప్రజలే కోర్టును ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడిదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నేరేడుచర్ల మండలం దిర్శించర్ల గ్రామంలో సర్వే నంబర్ 52లోని ఊర చెరువును కొందరు దర్జాగా కబ్జా చేస్తున్నారు. చెరువును ఆనుకొని ఉన్న తమ పట్టా భూమిల్లో పంటలు సాగు చేసుకుంటున్న కొందరు రైతులు ఏకంగా చెరువు శిఖం భూమిని ఏటా కొద్దికొద్దిగా ఆక్రమించుకుంటున్నా సంబంధిత అధికారులు మాత్రం ఆ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెరువులోని మట్టినే ఎత్తి శిఖం భూమిలో పోసి చదును చేస్తున్నారు. 52వ సర్వే నంబర్లో ఊర చెరువు మొత్తం 111.26 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ చెరువు పునరుద్ధరణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం కింద రూ.33 లక్షలు మంజూరు చేసింది. అయితే, కాంట్రాక్టర్లు ఆక్రమణకు గురైన చెరువు శిఖం భూముల జోలికి వెళ్లకుండానే మిగిలిన చెరువులోనే పూడికతీత చేపట్టారు. దీంతో చెరువు శిఖం పలువురి రైతుల కబ్జాలోనే ఉండిపోయింది. దీంతో చెరువు శిఖం భూమిని కాపాడాలని గ్రామానికి చెందిన పంగ నాగరాజు హైకోర్టును ఆశ్రయించారు.
ఇటీవల రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కలిసి చెరువులో సర్వే చేయగా చాలా భూమి ఆక్రమణకు గురైనట్లు తేలింది. చెరువు చుట్టూ ఉన్న రైతులు శిఖం భూమిని ఆక్రమించుకున్నట్లు తేలింది. సుమారు 22 మంది రైతులు 50 ఎకరాల వరకు ఆక్రమించుకున్నట్లు గుర్తించి నోటీసులు జారీ చేశారు. కానీ ఇంత వరకు వారి నుంచి మాత్రం శిఖం భూమిని స్వాధీనం చేసుకోలేదు.
ఆక్రమణకు గురవుతున్న ఊర చెరువును కాపాడాలని కోరుతూ అదే గ్రామానికి చెందిన ఊర చెరువు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం చైర్మన్ పంగ నాగరాజు గత జనవరిలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో స్పందించిన న్యాయస్థానం ఆక్రమణలు నిజమా.. కాదా అనే విషయంపై తుది నివేదికను ఫిబ్రవరి 22వ తేదీలోపు కోర్టుకు అందజేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించింది. దీంతో స్పందించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సర్వే చేసి మొత్తం 22 మంది రైతు లు సుమారు 50 ఎకరాలు ఆక్రమించుకున్నట్లు నివేదిక తయారు చేసి వారికి నోటీసులు జారీ చేశారు. కానీ ఇంత వరకు ఆక్రమించుకున్న భూమిని మాత్రం రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోలేకపోయా రు. ఇప్పటికైనా అధికారులు ఆక్రమణకు గురైన చెరువు శిఖం భూమి ని గుర్తించి హద్దులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఊర చెరువు ఆక్రమణ మా దృష్టికి వచ్చింది. చెరువు శిఖం భూమిని ఆక్రమించుకున్న వారికి నోటీసులు జారీ చేశాం. త్వరలోనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సర్వే చేయించి స్వాధీనం చేసుకుంటాం.
– సురిగి సైదులు, తాసీల్దార్