అర్వపల్లి, సెప్టెంబర్ 08 : రైతులకు యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ సూర్యాపేట జిల్లా నాయకుడు పోలేబోయిన కిరణ్, సీపీఎం మండలం కార్యదర్శి వజ్జే శ్రీను, పూలే అంబేద్కర్ ఆశయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఈదుల వీరపాపయ్య అన్నారు. సోమవారం అర్వపల్లి మండల కేంద్రoలోని సొసైటీ బ్యాంక్ ముందు నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం రైతులు రోజుల తరబడి దుకాణాల దగ్గర నిలపడుతున్నా ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు, అధికారులు కనీసం పట్టించుకున్న పాపానపోవడం లేదన్నారు. రైతు రుణమాఫీ, రైతు బంధు, సన్నదాన్యానికి బోనస్ ఇవ్వడంలో విఫలమైన ప్రభుత్వం ఇప్పుడు యూరియా అందించడంలో కూడా విఫలమైందన్నారు.
రోజుల తరబడి సొసైటీ, ఆగ్రోస్ కేంద్రాల వద్ద నిల్చోని విసుగు చెందిన రైతులు ఆందోళనలో ధర్నాలు చేస్తున్నా ఈ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.ప్రభుత్వం అసమర్ధత వల్ల రైతు అప్పులపాలై ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. తక్షణమే యూరియా అందించి రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో రైతులు వెంకన్న, రాంమల్లు, సంతు, లక్ష్మణ్, యాదయ్య పాల్గొన్నారు.