తిరుమలగిరి నవంబర్ 17: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తీరుతో జిల్లాలో పత్తి కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. ఇదే అదనుగా ప్రైవేటు వ్యాపారులు రెచ్చిపోయి సిండికేట్‌గా ఏర్పడి రైతులను నిండా ముంచుతున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు మామూళ్లు మత్తులో జోగుతున్నారు. నిన్నటి వరకు 5-6 వేల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసిన వ్యాపారులు సీసీఐ బంద్‌తో మరింత రెచ్చిపోతూ సిండికేట్‌గా మారి 3500 నుంచి 5 వేల లోపే పత్తి కొనుగోళ్లు చేస్తున్నారు. పట్టించుకోవాల్సిన ప్రభుత్వాలు ,అధికారులు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు.
సీసీఐ మూత పడటంతో ప్రైవేటు వ్యాపారులు మరింతగా రెచ్చిపోతున్నారు. ఇక సీసీఐ కొనుగోళ్లు చేపట్టదు.. ఆలోచిస్తూ కూర్చుంటే మొదటికే మోసం వస్తుంది. మరో వారం దాటితే రూ. 3500కు కూడా ఎవరూ పత్తి కొనుగోలు చేయరు. ఇప్పుడు అమ్ముకున్న వాళ్లే లాభపడుతారని రైతులకు మాయ మాటలు చెప్పి ప్రభుత్వ మద్దతు ధర రూ.8,110 వచ్చే నాణ్యమైన పత్తి సైతం రూ.5వేలకే కొనుగోలు చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి 2-3 వేలు కిరాయి పెట్టి ట్రాక్టర్లలో, డీసీఎంలలో పత్తి తెచ్చిన రైతులు తిరిగి తీసుకెళ్లలేక తక్కువ ధరకే విక్రయిస్తున్నారు.
రైతుల పక్షాన నిలబడాల్సిన అధికారులు మొద్దు నిద్ర వీడక పోవటంతో ప్రైవేటు వ్యాపారులు మార్కెటింగ్ శాఖ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. మార్కెటింగ్ శాఖ నిబంధనల ప్రకారం ట్రేడింగ్ లైసెన్స్ కలిగిన వ్యాపారులే పంట ఉత్పత్తులు కొనుగోలు చేయాలి. విధిగా ఎలక్ట్రానిక్ కాంటాలనే వాడాలి. బాట్లు, కాంటాలను తూనికలు, కొలతల శాఖ అధికారుల ముద్రలు వేయించుకోవాలనే నిబంధనలు ఎక్కడా పాటించటం లేదు. మండలంలోని ప్రతి గ్రామంలో ప్రైవేటు వ్యాపారులు, లైసెన్స్ లేని వ్యాపారులు, దళారులే ఎక్కువగా కొనుగోళ్లు చేస్తున్నారు. వెంటనే అధికారులు గ్రామాల్లో దళారుల ఆటలు కట్టించి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజక వర్గంలో 72,880 ఎకరాల్లో అత్యధికంగా పత్తి సాగు చేశారు. హుజూర్‌నగర్‌లో నియోజక వర్గంలో 29.384 ఎకరాలు, కోదాడ నియోజక వర్గంలో 14,379 ఎకరాలు, సూర్యాపేట నియోజకవర్గంలో 8,519 ఎకరాల్లో పత్తి సాగు చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
తుంగతుర్తి నియోజక వర్గంలో జిల్లాలోనే అత్యధికంగా ఈసారి పత్తి సాగు చేశారు. తిరుమలగిరి మండలంలో 7,510, నాగారంలో 6,500, జాజిరెడ్డి గూడంలో 2,123, తుంగతుర్తిలో 3,742 , నూతనకల్‌లో 5,483 ,మద్దిరాలలో 5,971 , అడ్డగూడూరులో 11,926 , మోత్కూర్‌లో 6,395 ,శాలిగౌరారంలో 23,230 ఎకరాల్లో పత్తి సాగు చేశారు.
ప్రభుత్వం పేరుకు మాత్రమే సూర్యాపేట జిల్లాలో 6 జిన్నింగ్ మిల్లులో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. వీటిని ఎల్ 1 ,ఎల్ 2 , ఎల్ 3 , ఎల్ 4 , ఎల్ 5 , ఎల్ 6గా విభజించింది. కానీ పత్తి కొనుగోళ్లు జరిగింది మాత్రం సూర్యాపేట సమీపంలోని బాలెంల , తిరుమలగిరి లోని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రంలో మాత్రమే. వీటిలో కొనుగోలు సామర్థ్యం పూర్తయ్యాకే మిగతా వాటిని తెరవాలంటూ ఆంక్షలు విధించింది. దీనితో నెల రోజుల వ్యవధిలో ఈ రెండు సీసీఐ కొనుగోలు కేంద్రాలు 10 వేల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేస్తే తిరుమలగిరి నియోజక వర్గంలో ప్రైవేటు వ్యాపారులు లక్షా 50 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశారు. ఈసారి సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించారు. అందులో 6 కేంద్రాల్లో రెండు కేంద్రాల్లో మాత్రమే కొనుగోళ్లు జరిగాయి. దీంతో సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లి పత్తి విక్రయించలేక రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించారు.
ఈ సారి సీసీఐ ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో రైతులకు దుఖఃమే మిగిలింది. గతంలో ఎన్నడూ లేని నిబంధనలు పత్తి రైతులకు అంటకట్టింది. కిసాన్ కపాస్ ఆన్లైన్ నమోదు, 8 శాతం తేమ ఉండాలనడం, ఎకరాకు 7 క్వింటాళ్ల మాత్రమే పత్తి కొనుగోళ్లు , 6 సీసీఐ కేంద్రాల్లో రెండింటికే కొనుగోళ్ల అనుమతి ఇలా రకరకాల ఆంక్షలు విధించటంతో పత్తి రైతులు మరింత ఆయోమయానికి గురై ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి అరిగోస పడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే సీసీఐ కూడా ప్రైవేటు వ్యాపారులను ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందని రైతులు ఆరోపిస్తున్నారు.
సీసీఐ తో రైతులకు ఏం లాభం లేదు. 15 రోజులు నడిచింది బంద్ అయ్యింది. ఇప్పుడు ఎక్కడ పోయి అమ్ముకోవాలే ..తెచ్చిన అప్పులు ఎట్ల తీరాలే అం దుకే తక్కువ ధర అయిన వ్యాపారులకు అమ్మి తెచ్చిన అప్పు తీర్చాలే. మమ్మల్ని ఆదుకునే వారే లేరు. రైతులు అంటే ఆందరికి అలుసే. వేల రూపాలయలు పెట్టుబడి పెట్టి పంట పండిస్తే వర్షం ముం చింది. ఇటు ప్రభుత్వం పట్టించుకోదు ఏం చేయాలి. ఎటూ పోయినా రైతులే మునుగుతున్నరు.
– రాములు, రైతు, తిరుమలగిరి