నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్1(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల కేటాయింపు విషయంలో అనుసరించిన విధానాలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆసక్తికర పరిణామాలెన్నో చోటుచేసుకుంటున్నాయి. ఉన్నతాధికారులు పంపిన జాబితా అధారంగా జిల్లా అధికారులు స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు చేశా రు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు 2011 జనా భా లెక్కలు, బీసీ రిజర్వేషన్లకు 2024లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన ఆధారంగా రిజర్వేషన్లను నిర్ధారించారు. దీంతో చాలా చోట్ల ఓటర్ల సంఖ్యతో సంబంధం లేకుండా రిజర్వేషన్లు వచ్చాయి. ఇలా ప్రభుత్వం ఫైనల్ చేసిన రిజర్వేషన్ల జాబి తా చూసుకున్న రాజకీయ పార్టీల నేతలతోపాటు ఆశావాహులు సైతం కంగుతినాల్సి న పరిస్థితి వచ్చింది. కిందటి సారి అమలు చేసిన రిజర్వేషన్లకు ఈ సారి రోటేషన్ కూడా చేయడంతో మరింత ఆసక్తికరంగా రిజర్వేషన్ల కేటాయింపు జరిగినట్లు తెలుస్తోంది. దీంతో చాలాచోట్ల ఎవరూ ఊహించని విధంగా రిజర్వేషన్లు వచ్చా యి. కొన్ని చోట్ల రిజర్వేషన్లకు అనుకూలంగా అభ్యర్థులే లేకపోవడంతో ఎన్నిక జరిగే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. ఇలా పలుచోట్ల సర్పంచ్ స్థానాలకు, చాలా చోట్ల వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించే అవకాశాలే లేనట్లు సమాచారం. ఇలా క్షేత్రస్థా యి నుంచి అందుతున్న సమాచా రం మేరకు పలు గిరిజన తండాలు బీసీలకు రిజర్వు అయ్యాయి. అ యితే అక్కడ అసలు బీసీ ఓటర్లే లేరు. దీంతో ఇప్పు డు స్థానిక గిరిజనులు తలలు పట్టుకుంటున్నారు. ఇవేం రిజర్వేషన్లు అంటూ ప్రభుత్వంపై ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పలు చోట్ల గ్రామ పంచాయతీల సర్పంచ్‌లకు రిజర్వు కేటగిరి అభ్యర్థులు లేరని తెలుస్తోంది. దామరచర్ల మండలంలోని ఏడు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పోస్టులు బీసీలకు రిజర్వు అయ్యాయి. ఇక్కడ బీసీ ఓటర్లే లేరని తేలింది. మాడ్గులపల్లి మండలం అభంగాపురంలో సర్పంచ్ స్థానం ఎస్టీలకు రిజర్వు అయ్యింది. దీంతో పాటు నాలుగు వార్డులు సైతం ఎస్టీలకు కేటాయించారు. కానీ అక్కడ ఎస్టీ జనాభాయే లేదు. పైగా ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి ఒక్క స్థానం కూడా రిజర్వు కాకపోవడంతో స్థానికులు రిజర్వేషన్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుగులలో ఇద్దరే ఎస్టీ ఓటర్లు ఇండగా ఇక్కడ సర్పంచ్ పదవితో పాటు నాలు గు వార్డులు ఎస్టీలకు రిజర్వు అయినట్లు తెలిసింది. దీంతో ఇక్కడ మూడు వార్డులకు అభ్యర్థులే లేకపోవడంతో ఎన్నిక జరిగే అవకాశం కనిపిస్తలేదు. అడవిదేవులపల్లి మండలంలోని చాం ప్లా తండాలో ఒక్క బీసీ ఓటరు లేకపోయినా ఇక్కడ రిజర్వు చేశారు. చందంపేట మండలం గుంటిపల్లిలో ఒకే ఒక్క బీసీ కుటుంబం ఉం డగా అక్కడి సర్పంచ్ స్థానం బీసీలకు కేటాయించడం గమనార్హం. మిర్యాలగూడ మండలం జాలుబాయితండాలో నలుగురే బీసీ ఓటర్లు ఉండగా ఇక్కడ సర్పంచ్ స్థానం బీసీలకు రిజ ర్వు అయ్యింది. అనుముల మండలం పేరూరులో సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వు అయ్యింది. అయితే ఇక్కడ అసలు ఎస్టీ ఓటర్లే లేకపోవడం విశేషం. పక్కనే ఉన్న వీర్లగడ్డ తం డాకు చెందిన దేపావత్ రాజేశ్ ఒక్కడే పేరూరులో ఎస్టీ ఓటరుగా నమోదై ఉన్నాడు. అతడి భార్యకు కూడా ఇక్కడ ఓటు లేదు. దీంతో ఇక్కడ ప్రస్తుతం సర్పంచ్ పదవికి ఎన్నిక జరిగే అవకాశం లేకుండా పోయింది. ఇలా సర్పంచ్ పదవులకు రిజర్వు అయిన స్థానాల్లో ఆ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎవరూ లేకపోతే అక్కడ ఎన్నిక జరిగే అవకాశమే లేదు. కానీ వార్డు సభ్యుల స్థానాలకు మాత్రం ఎన్నిక నిర్వహిస్తారు. దీంతో ఇక్కడ గెలిచిన వార్డు సభ్యులతోనే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. అతనే గ్రామ పాలనలో కీలకం కానున్నారు.
రిజర్వేషన్ల విధానానికి అనుసరించిన పద్ధతిపై ఎన్నో సందేహాలు క్షేత్రస్థాయిలో తలెత్తుతున్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వర్తింపచేసే క్రమంలో ఎస్సీ, ఎస్టీ జనాభాను కూడా పరిగణలోకి తీసుకున్నారు. మం డలంలో ఎక్కువ జనాభా ఉన్న ఎస్సీ, ఎస్టీ గ్రామాలను తీసుకొని రిజర్వేషన్లు వర్తింప చేస్తే అసలు ఆ సామాజిక వర్గం ఓట ర్లే లేనప్పుడు ఎలా రిజర్వు అవుతాయనేదే ప్రశ్న. అక్కడ ఆ సామాజిక వర్గానికి చెందిన జనాభా ఉంటేనే ఎంపిక చేయా లి కదా అన్న సందేహాలు నెలకొన్నాయి. కానీ రిజర్వేషన్ల ఎంపికకు అనుసరించిన విధానంలో నే గందరగోళం ఉందనే అనుమానాలు క్షేత్రస్థాయిలో తలెత్తుతున్నాయి. ఎన్నో ఏండ్లుగా తల లు పండిన రాజకీయ నేతలు సైతం ఇవేం రిజర్వేషన్లు అని తలలు పట్టుకుంటున్నారు.
ఇవన్నీ ఇలా ఉంటే ప్రస్తుతం ప్రకటించిన రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు జరుగుతాయా లేదా అంటూ చర్చలు సాగుతున్నాయి. ఈ రిజర్వేషన్లతో ఎన్నికలు జరిగే ప్రసక్తే లేదని ప్రభుత్వంలోని కీలక మంత్రులే చెప్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల నల్లగొండలో ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఓ మంత్రి రిజర్వేషన్లపై స్పందిస్తూ ఈ రిజర్వేషన్లతో ఎన్నికలు రావు ఏమీ రావు… పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరగొచ్చని అన్నారనే సమాచారం. ఇక జిల్లాకు చెందిన మరో మంత్రి సైతం తన నియోజకవర్గంతో పాటు తన సతీమణి ప్రాతినిధ్యం వహిస్తున్న నియెజకవర్గంలో సైతం ఈ నెల 8వ తేదీన హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాతనే ఎన్నికల సన్నాహాలు చేద్దామంటూ క్యాడర్‌కు సూచించారు. ఇక ఎమ్మెల్యేలు సైతం అభ్యర్థుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని అధికార పార్టీకి చెందిన కీలక నేతలంతా అప్పుడే తొందర వద్దు… హైకోర్టు ఏమీ చెప్తుందో వేచి చూద్దామన్న ధోరణిలోనే ఉన్నట్లు సమాచారం. దీంతో అసలు ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయా లేదా అనే సందేహాలు సర్వత్రా నెలకొన్నాయి. ప్రభుత్వాన్ని నడిపిస్తున్న అధికార పార్టీ నేతలే ఎన్నికలపై సందేహాలు వ్యక్తం చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలు పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. దీంతో అందరి దృష్టి ఈ నెల 8వ తేదీన హైకోర్టు ఇచ్చే తీర్పుపైనే కేంద్రీకృతమై ఉంది. ఒక వేళ ఏదైనా పరిస్థితుల్లో ఎన్నికలు వాయిదా పడితే తిరిగి జనవరిలో నిర్వహిస్తారని అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలు అభిప్రాయపడుతున్నారు.