సూర్యాపేట, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : రైతులందరికీ రుణమాఫీ చేయాలని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి బీఆర్ఎస్ తలపెట్టిన రైతు ధర్నా శిబిరంపై కాంగ్రెస్ మూకలు చేసిన దాడిపై విచారణ సజావుగా సాగేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం కాంగ్రెస్ గూండాలు దాడికి దిగిన ఘటనలో పోలీసుల పాత్ర కూడా ఉండడం అనుమానాలకు బలం చేకూరుస్తున్నది. కాంగ్రెస్ శ్రేణులు రాళ్లు, గుడ్లు విసురుతూ దాడికి పాల్పడుతుండగా వారిని నివారించకపోగా పోలీసులే బీఆర్ఎస్ దీక్షా శిబిరం టెంట్లను కూల్చివేయడం విస్మగొల్పుతున్నది.
తిరుమలగిరిలో బీఆర్ఎస్ దీక్షా శిబిరంపై కాంగ్రెస్ చేసిన దాడితో పదేండ్లపాటు ప్రశాంతంగా ఉన్న తుంగతుర్తి నియోజకవర్గం ఉలిక్కిపడింది. ప్రధానంగా దాడులకు పాల్పడే వారికి పోలీసుల సహకారం ఉందని తెలుస్తుండడంతో భవిష్యత్ ఎలా ఉంటుందోననే భయాందోళనలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పాలనలో గత పదేండ్లలో గాదరి కిశోర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఒక్క దాడి కూడా లేకపోగా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఇలాంటి దారుణాలు జరుగడంపై జనం చర్చించుకుంటున్నారు.
సొంత పార్టీ నేతలే ఇసుక మాఫియా, కాంట్రాక్ట్ మాఫియా అంటూ స్థానిక ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తుండగా.. మరోవైపు ఎనిమిది నెలల కాలంలో బీఆర్ఎస్ శ్రేణులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీక్షా శిబిరంపై దాడికి పాల్పడే వారికి సహకారం అందించిన పోలీసులు బాధితులకు ఎలా న్యాయం చేస్తారని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ దాడులను ప్రోత్సహిస్తూ టెంట్లు కూల్చిన పోలీసులను రక్షించేందుకు కాంగ్రెస్ నియోజకవర్గ బాస్ రాష్ట్ర పెద్దలతో ఒత్తిడి తెస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
కాగా, నిన్నటి ఘటనకు సంబంధించి ఇరు వర్గాలు ఫిర్యాదులు చేయగా.. కాంగ్రెస్కు చెందిన ఆరుగురు, బీఆర్ఎస్కు చెందిన ఆరుగురు పోలీసులు కేసులు నమోదు చేశారు. సీసీ ఫుటేజీలను పరిశీలించి ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి కేసులు నమోదు చేయనున్నట్లు చెప్తున్నారు. దాడికి దిగిన కాంగ్రెస్ గుంపులో దాదాపు 50మందికిపైనే ఉంటే కేవలం ఆరుగురిపై కేసు నమోదు చేయడం పట్ల బీఆర్ఎస్ నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దాడికి పాల్పడిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను వెంటనే గుర్తించి కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.