CITU | చండూరు, ఏప్రిల్ 06 : సీఐటీయూ వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రెడ్ బీటీ రణధేవే 35వ వర్దంతిని నల్గొండ జిల్లా చండూరులో ఘనంగా నిర్వహించారు. మార్కెట్ యార్డులో నిర్వహించిన ఈ వేడుకల్లో భాగంగా బీటీ రణధేవే చిత్రపటానికి సీఐటీయూ చండూరు మండల కన్వీనర్ జెర్రిపోతుల ధనుంజయ పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ధనుంజయ మాట్లాడుతూ.. సీఐటీయూ అఖిలభారత కమిటీ పిలుపు మేరకు అమరవీరుల స్ఫూర్తితో సామాజిక న్యాయం సాధించడం కోసం ఏప్రిల్ 6 నుంచి 14 వరకు సామాజిక న్యాయ సాధన క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్మిక వర్గాన్ని కులాల పేరుతో, మతాల పేరుతో చీల్చి కార్పోరేట్ శక్తులు తమ దోపిడీ కొనసాగిస్తున్నాయని అన్నారు. మనువాదాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యాంగాన్ని కాపాడుకుందామన్నారు. మహిళల, మైనారిటీల, దళిత గిరిజనులపై జరుగుతున్న దాడులను ప్రతిఘటిస్తూ మనుషులంతా ఒక్కటే అంటూ సామాజిక న్యాయం కోసం కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను రక్షించాలని కోరారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని సీఐటీయూ పోరాడుతుందని అన్నారు.
సామాజిక న్యాయ సాధన క్యాంపెన్లో భాగంగా 9వ తేదీ సామాజిక న్యాయ సంఘీభావనిధి వసూలు, 10వ కామ్రేడ్ విమల రణదేవి జయంతి, 11న మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి, 13వ బైక్ ర్యాలీ 14న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ వారోత్సవాల్లో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ సీనియర్ నాయకులు చిట్టిమల్ల లింగయ్య, ఎం.వెంకటేశం, హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు సాయం కృష్ణయ్య, జిల్లపల్లి సైదులు, కొంక బిక్షం, కొంక రాములు, సాయం సత్యనారి, సాయం శేఖర్, కొరిమి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.