రామగిరి, ఫిబ్రవరి 03 : నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో హాస్టల్ విద్యార్థులకు కలుషిత ఆహారం అందించడం, ఆహారంలో గుట్కా ప్యాకెట్ రావడాన్ని తీవ్రంగా నిరసిస్తూ బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగార్జున ముదిరాజ్ పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని వర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్‌కి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూనివర్సిటీ ఏర్పడిన నుండి పలు సమస్యలతో సతమతమౌతోందన్నారు. గడిచిన రెండు సంవత్సరాల కాలంలో యూనివర్సిటీ హాస్టల్స్‌లో కలుషిత ఆహారం రావడం ఇది 6వ సారి అని మండిపడ్డారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ సంఘటనలకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకుని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వీసీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కమీషన్ల మీద ఉన్న సోయి విద్యార్థుల భవిష్యత్‌పై లేదని ఆరోపించారు. ఇప్పటికైనా విద్యా శాఖ మంత్రిని నియమించి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని, యూనివర్సిటీ కళాశాలల్లో మెరుగైన వసతులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ నాయకులు గాదె శివ, చలకాని పరమేష్, కన్నబోయిన వంశీ, దాసరి మచ్చ గిరి, రాంబాబు, మహేష్, సైదులు, సంపత్ పాల్గొన్నారు.