విదేశీ నిధుల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) సవరణకు కేంద్రం తలపెట్టిన సవరణలపై చర్చ రోజురోజుకూ వేడెక్కుతున్నది. దేశంలో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, మానవ హక్కుల సంస్థలు, పరిశోధనా సంస్థలకు విదేశాల నుంచి సమకూరే విరాళాలపై కీలక నియంత్రణలు ప్రవేశపెట్టే బిల్లు ప్రస్తుతం పార్లమెంటు ముందున్నది. పాలక పక్షం ఎలాగైనా దీనిని ఆమోదింపజేయాలని చూస్తుంటే, విపక్షం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. పారదర్శకత కోసమే బిల్లు తెచ్చామనేది సర్కార్ వాదన. కాదు, ప్రశ్నించే గొంతులను నొక్కేందుకే సవరణలు తెస్తున్నారని విపక్షం ఆరోపిస్తున్నది. తాజాగా అమెరికా విమర్శలను భారత్ ఖండించడంతో ఈ వివాదానికి అంతర్జాతీయ కోణం ఏర్పడింది.
కేంద్ర హోంశాఖ గణాంకాల ప్రకారం 2019-2022 మధ్యకాలంలో 13,520 సంస్థలు రూ.55,741 మేర విదేశీ నిధులు స్వీకరించాయి. ఎఫ్సీఆర్ఏ పోర్టల్ ప్రకారం దేశంలో 14,449 సంస్థలు క్రియాశీలంగా ఉన్నాయి. 22,498 సంస్థల సర్టిఫికెట్లు రద్దయ్యాయి. మరో 15,212 సంస్థల సర్టిఫికెట్ల గడువు తీరిపోయింది. ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణల ప్రకారం ఎప్పటికప్పుడు పునరుద్ధరణ తప్పనిసరి. అదేవిధంగా ఎఫ్సీఆర్ఏ నమోదు రద్దయిన, వెనుకకు ఇచ్చేసిన, గడువు తీరిపోయిన సంస్థల విదేశీ నిధుల పర్యవేక్షణ, నిర్వహణ, జప్తు వంటి విశేషాధికారాలతో కూడిన ’డిజిగ్నేటెడ్ అథారిటీ’ ఏర్పాటు అనేది ఈ బిల్లులోని మరో కీలక వివాదాంశం.
బిల్లుకు సంబంధించినంతవరకు ప్రధానంగా మూడు అంశాలు కనిపిస్తున్నాయి. మొదటిది, పారదర్శకత పేరుతో మితిమీరిన నియంత్రణ ప్రవేశపెట్టడం. ఎఫ్సీఆర్ఏ కింద విదేశీ నిధులు స్వీకరించాలంటే అత్యంత కఠినమైన అనుమతులు పొందాల్సి రావడం. ఈ అనుమతులను ఎప్పటికప్పుడు పునరుద్ధరించుకోవడం తప్పనిసరి చేయడం. జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండే విరాళాలను నిషేధించాలనే సవరణ ఈ వివాదానికి కేంద్రంగా ఉన్నది. నిజంగా ఇదంతా అక్రమ నిధులను అరికట్టడానికేనా? లేక ప్రభుత్వానికి ఇష్టం లేని సంస్థలను లక్ష్యంగా చేసుకునే సాధనమా? అనేది ప్రశ్న. ఈ నిబంధనలు పాటించడంలో విఫలమయ్యే స్వచ్ఛంద సంస్థల రిజిస్ట్రేషన్లు రద్దయిపోతాయి. బ్యాంకు ఖాతాలు స్తంభించిపోతాయి. నిధులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే వీలు కలుగుతుంది.
ఎఫ్సీఆర్ఏ సవరణలు ప్రభుత్వం చేతిలో అస్త్రంగా మారే ప్రమాదముందనేదే ప్రధానమైన విమర్శ. రెండోది, పౌర సమాజంపై పడే ప్రతికూల ప్రభావం. గ్రామీణాభివృద్ధి, విద్య, ఆరోగ్యం, మానవ హక్కుల పరిరక్షణ వంటి రంగాల్లో పనిచేసే ఎన్నో సంస్థలు ప్రధానంగా విదేశీ నిధులపై ఆధారపడుతుంటాయి. ఎఫ్సీఆర్ఏ నిబంధనలను కఠినతరం చేస్తే ఈ సంస్థల కార్యకలాపాలు దెబ్బతింటాయి. ఇది చివరికి సామాన్య ప్రజలపైనే ప్రభావం చూపుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం తప్పుల్ని ఎత్తిచూపి, ప్రత్యామ్నాయ ఆలోచనలను ముందుకు తెచ్చే సంస్థలపై నియంత్రణ పెంచడం ప్రజాస్వామ్య స్ఫూ ర్తికి విరుద్ధమని సవరణలను వ్యతిరేకించేవారు అంటున్నారు. మూడోది, ఈ సరికే చట్టం అమలులో వివక్ష చోటుచేసుకున్నదనే విమర్శలు. అన్ని సంస్థలపై కేంద్రం ఒకేరీతిగా చర్యలు తీసుకోవడం లేదని, ఎఫ్సీఆర్ఏ చట్టాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా ముందుకు తెచ్చిన సవరణలపై అమెరికా నుంచి విమర్శలు రావడం గమనా ర్హం. భారతదేశంలో పౌర సమాజంపై నియంత్రణలు పెరుగుతున్నాయని కొందరు అమెరికా ప్ర జాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేయడంతో వివాదం తలెత్తింది. దీనిపై భారత ప్రభుత్వం ’తమ అంతర్గత విషయాల్లో విదేశాల జోక్యం సమంజసం కాదు’ అంటూ ఈ విమర్శలను తిరస్కరించింది. విదేశీ నిధుల ప్రవాహం ద్వారా దేశ భద్రతకు, రాజకీయ స్థిరత్వానికి ముప్పు వా టిల్లే ప్రమాదం ఉంటుందనేది ప్రభుత్వ వాదన.
దేశ భద్రత, ఆర్థిక పారదర్శకతను కాపాడడం మంచిదే. అలాగే కఠినమైన నియంత్రణల పేరిట ప్రజాస్వామ్య హక్కులను హరించకుండా ఉండడమూ అంతే ముఖ్యం. విదేశీ విమర్శలను తోసిపుచ్చడం ఎలా ఉన్నా, దేశీయంగా లేవనెత్తుతున్న ఆందోళనలను మాత్రం ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. చట్టం దుర్వినియోగానికి అవకాశం లేకుండా బిగింపులు ఉండాలి. అన్ని సంస్థలను ఒకేతీరుగా చూసే సమతుల్యతకు పెద్దపీట వేస్తేనే నమ్మకం పెరుగుతుంది. లేకపోతే, ని యంత్రణ పేరుతో ప్రశ్నించే గొంతుల అణచివేత అనే ముద్ర మరింత బలపడుతుంది.