ఉద్యమాల పురిటి గడ్డ.. ఎందరో ఉద్దండులైన ఉద్యమకారులకు పుట్టిల్లు అయిన సూర్యాపేట తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఎగిరిన గులాబీ జెండాను మొదటి నుంచీ గుండెలకు అత్తుకున్నది. ప్రత్యేక రాష్టమే శ్వాసగా, ధ్యాసగా సాగిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతి అడుగుకూ మద్దతు పలికి కదం తొక్కింది. నాడు ఉద్యమ సారథిగా అయినా, ఆ తర్వాత స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అయినా కేసీఆర్ మదిలో సూర్యాపేటకు ప్రత్యేక స్థానం ఉంది. అందుకే ఆయన అనేక చరిత్రాత్మక కార్యక్రమాలకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలోకి అడుగిడుతున్న నేపథ్యంలో వరంగల్‌లో తలపెట్టిన రజతోత్సవ సభ విజయవంతానికి నిర్వహించనున్న సన్నాహక సమావేశాల ప్రారంభానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సూర్యాపేటనే ఎంచుకోవడం విశేషం. ఈ మేరకు ఆయన గురువారం సూర్యాపేటకు రానున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డితో కలిసి బీఆర్ఎస్ పార్టీ జిల్లా స్థాయిలో ముఖ్య కార్యకర్తలతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు.
సూర్యాపేట, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఉద్యమ సమయంలోనైనా, కొట్లాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో అయినా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేట జిల్లా నుంచి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నాగార్జునసాగర్ ఆయకట్టు రైతులకు సాగు నీరు ఇవ్వాలని 2002లో కోదాడ నుంచి నాగార్జునసాగర్ వరకు పాదయాత్ర చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని అణగదొక్కాలనే కుట్రకు తెరలేపి బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలను లాక్కున్న నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష లేదంటే.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్యమ రథసారథిగా ఊరూరూ తిరిగి తెలంగాణ ఆకాంక్షను ఎలుగెత్తి చాటారు.
2006లో పల్లెబాటతో చేపట్టిన ఈ పాదయాత్రను ఉద్యమం నాటి నుంచి ఆయనకు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి స్వగారం నాగారం నుంచే మొదలు పెట్టారు. ఉద్యమ సమయంలో పోరాటానికి ఊపిరిలూదుతూ హైవే దిగ్బంధనాలతో సూర్యాపేట ఎంతో స్ఫూర్తిని నింపింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దోఖాలకు బుద్ధి చెప్పేందుకు 2012లో కనీవిని ఎరుగని రీతిన లక్షలాది మందితో కేసీఆర్ సూర్యాపేటలో సమరభేరి సభ నిర్వహించారు. పార్టీ మ్యానిఫెస్టోను సైతం ఇక్కడి నుంచే ప్రకటించారు. మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుడు యాసంగిలో రాష్ట్రవ్యాప్తంగా వరి పంటలు ఎండిపోతున్నా కనీసం స్పందించకపోవడంతో ప్రతిపక్ష నేతగా తొలిసారి సూర్యాపేట జిల్లా నుంచే కేసీఆర్ కరువు యాత్రను ప్రారంభించి రైతుల పక్షాన
నిలిచారు.
రజతోత్సవ సభ విజయవంతం కోసం
బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ అన్ని జిల్లాల పర్యటనకు సిద్ధం కాగా, తొలి సమావేశానికి సూర్యాపేటనే ఎంచుకున్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో జరుగనున్న పార్టీ జిల్లా స్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరై దిశానిర్దేశం చేయనున్నారు. జనగాం క్రాస్‌రోడ్డు వద్ద పనులు జరుగుతున్నందున నేరుగా కొత్త బస్టాండ్ వద్దకు కేటీఆర్ చేరుకోనున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయానికి వస్తారు. ఉదయం 11.30 గంటలకు సన్నాహక సమావేశం వేదిక మీదకు చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు సమావేశం జరుగనుంది.
తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఏమాత్రమూ ఆశాజనకంగా లేకపోవడం, రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నా సర్కారు పట్టించుకోకపోవడంపై సమావేశంలో చర్చించడంతోపాటు పార్టీ ప్రస్థానాన్ని కేటీఆర్ మరోసారి గుర్తుచేసే అవకాశం ఉంది. వాటితోపాటు పార్టీ నిర్మాణంపైనా మాట్లాడే చాన్స్ ఉంటుంది. సమావేశం అనంతరం ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్న భోజనం చేసి తిరుగు ప్రయాణం కానున్నారు. సమయాన్ని బట్టి సూర్యాపేట సమీపంలో ఎండిన వరి పంటను పరిశీలించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో గురువారం నాటి కేటీఆర్ పర్యటన ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. సన్నాహక సమావేశం విజయవంతం కోసం జగదీశ్‌రెడ్డి రెండు రోజులుగా నియోజవకర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి కేడర్‌కు దిశా నిర్దేశం చేశారు.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పేదల సొంతింటి కలను నెరవేర్చే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ సూర్యాపేట నుంచే శ్రీకారం చుట్టారు. స్థానిక గొల్లబజారులో నాటి మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయానికి శంకుస్తాపన చేశారు. ఏడాది వ్యవధిలో ప్రారంభోత్సవం కూడా చేశారు. అంతేగాక కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం తొలి ఫలితం సూర్యాపేటకు దక్కింది. సూర్యాపేట ప్రజలు సైతం అన్నీ మననంలో ఉంచుకుంటూ వరుసగా మూడుసార్లు బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగిన జగదీశ్‌రెడ్డిని గెలిపించి కేసీఆర్‌కు సూర్యాపేటపై ఉన్న అభిమానాన్ని రెట్టింపు చేశారు.
సూర్యాపేట చరిత్ర సృష్టించబోతున్నది
టీఆర్ఎస్గా ఉన్నా, బీఆర్ఎస్గా మారినా అనేక ఉద్యమాలు, అభివృద్ధికి కేంద్ర బిందువుగా నిలిచిన సూర్యాపేట మరో చరిత్ర సృష్టించడం ఖాయం. సూర్యాపేట కేంద్రంగా జరిగిన అనేక పోరాటాలు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తును లేవడానికి దోహదపడ్డాయి. రాష్ట్రఆవిర్భావం అనంతరం అనేక కార్యక్రమాలకు కూడా ఇక్కడి నుంచే అంకురార్పణ జరిగింది. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్‌కు సూర్యాపేటపై ఉన్న అభిమానం, నమ్మకం, సెంటిమెంట్‌ను గౌరవిస్తూ కేటీఆర్ రజతోత్సవ సంబురాల నాందికి సూర్యాపేటను ఎంచుకోవడం సంతోషకరం.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌కు కూడా సూర్యాపేటతో ఎంతో అనుబంధం ఉంది. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తొలిరోజుల్లో వర్థమానుకోటలో జరిగిన తెలంగాణ ఉద్యమ సభలోనే తొలి ప్రసంగం చేశారు. ఇప్పుడు రజతోత్సవ సభ విజయవంతం కోసం రాష్ట్రవ్యాప్తంగా జరిగే సన్నాహక సమావేశాల్లో భాగంగా తొలి సమావేశానికి సూర్యాపేటను ఎంచుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, ఇచ్చిన హామీల అమలుకు రానున్న రోజుల్లో జరిగే ఉద్యమాలకు సూర్యాపేటనే నాంది పలకడం ఖాయం.
-గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే