నల్లగొండ ప్రతినిధి, మే21(నమస్తే తెలంగాణ) : ‘ప్రభుత్వ పెద్దల కమీషన్ల కక్కుర్తితో ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం కుప్పకూలి మూడు నెలలు అవుతున్నది. ఇప్పటివరకూ అందులో చిక్కుకుపోయిన వారి మృతదేహాలను బయటకు తీయలేకపోయారు. ఆ పనుల్లో ఏం జరిగిందో చెప్పే పరిస్థితి లేదు. నల్లగొండ రైతులు, బిడ్డల తరుఫున సీఎం రేవంత్‌రెడ్డిని అడుతున్నా.. దీనిపై సమాధానం చెప్పాలి’ అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండలో జరిగిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు జిల్లా శంకర్ వివాహానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ ముఖ్య నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ర్టానికి సమర్ధవంతమైన సీఎం ఉండి ఉంటే మంగళ్గ్రామ్లో చిక్కుకున్న మనుషులను సైతం తీసుకురావచ్చన్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వ ఆసమర్ధత స్పష్టంగా అర్ధమవతున్నదని విమర్శించారు. నల్లగొండ జిల్లా పరిధిలోని సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే నేటికీ అందుకు కారణమైన సంస్థపై విచారణ లేదని, కనీసం చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. వట్టెం పంపుహౌస్ మునిగినా, పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయినా పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల పేర్లతో విచారణ, నోటీసులు అంటూ డ్రామాలు చేస్తున్నదని విమర్శించారు. ఎన్ని డ్రామాలు చేసినా ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసే వరకు ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని ఈ సందర్భంగా కేటీఆర్ హెచ్చరించారు.
బీఆర్ఎస్వీలో కీలకంగా పని చేసి, ప్రస్తుతం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడిగా కొనసాగుతున్న కనగల్ మండలం రేగట్టెకు చెందిన జిల్లా శంకర్ వివాహానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నల్లగొండలోని ఎంఎన్ఆర్ గార్డెన్స్‌లో జిల్లా శంకర్ దంపతులను మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆశీర్వదించారు. పెండ్లి మండపంలోనే శంకర్ కుటుంబ సభ్యులందరితో కేటీఆర్ ఓపికగా ఫొటోలు దిగారు. మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ చొరవ తీసుకుని వీరిని కేటీఆర్‌కు పరిచయం చేస్తూ కనిపించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు తమ కుటుంబాలతో కలిసి కేటీఆర్‌తో ఫొటోలు దిగారు. పెండ్లికి వచ్చిన యువత, పార్టీ శ్రేణులు కేటీఆర్‌తో సెల్పీల కోసం ఎగబడుతూ వెంట నడిచారు.
ఈ సందర్భంగా కేటీఆర్ ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన పార్టీ నేతలందరినీ పేరుపేరునా పలకరిస్తూ ముందుకు సాగారు. అనంతరం అక్కడే పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడి, అనంతరం భోజనం చేశారు. ఆ తర్వాత జోరు వర్షంలోనే తిరిగి హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కూడా ఇతర సభ్యులతో కలిసి శంకర్ దంపతులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, గాదరి కిశోర్‌కుమార్, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, తిప్పన విజయసింహారెడ్డి, పార్టీ నేతలు ఒంటెద్దు నర్సింహారెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి, పల్లా ప్రవీణ్‌రెడ్డి, రాంచంద్రనాయక్, చకిలం అనిల్‌కుమార్, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, తుంగ బాలు, మందడి సైదిరెడ్డి, రాంబాబునాయక్, బోనగిరి దేవేందర్, శరణ్యారెడ్డి పాల్గొన్నారు.