సూర్యాపేట టౌన్, మార్చి 13 : ప్రభుత్వ అసమర్థతను అసెంబ్లీ వేదికగా ప్రశ్నించిన మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని సమావేశాలను నుంచి సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌ను తీవ్రంగా నిరసిస్తూ గురువారం సాయంత్రం స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి మాట్లాడారు. రైతాంగ సమస్యలపై ఓ రైతుగా అసెంబ్లీలో పోరాడుతున్న ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం అన్నారు.
అబద్దాలమయమైన గవర్నర్ ప్రసంగాన్ని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా అని వారు ప్రశ్నించారు. 14 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ సాధించిన కేసీఆర్‌ను అనరాని మాటలు అన్న రేవంత్ రెడ్డి కుసంస్కారి అని దుయ్యబట్టారు. కేసీఆర్ కాళేశ్వరం ద్వారా చివరి భూములకు నీరు అందించి చెరువులు నింపారని నేడు నీళ్లు లేక రైతుల పెడుతున్న కన్నీరు చూసి తట్టుకోలేక అసెంబ్లీలో కన్నీరు పెడుతున్న నాయకుడు జగదీశ్ రెడ్డి అన్నారు. జగదీశ్ రెడ్డి అసెంబ్లీలో ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం, రైతు సమస్యలపై చర్చిస్తే తట్టుకోవాలని దద్దమ్మ ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. ప్రజాక్షేత్రంలోకి రేవంత్ రెడ్డి వస్తే ప్రజలు బట్టలిప్పి పంపేందుకు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
సస్పెన్షన్‌కు భయపడేది లేదని ప్రజాక్షేత్రంలో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కొట్లాడుతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రజల కోసం, రైతుల సమస్యల కోసం కొట్లాడే జగదీశ్ రెడ్డిని అసెంబ్లీలోకి స్వాగతించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి జిడి భిక్షం, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, పార్టీ జిల్లా నాయకులు గండూరి ప్రకాశ్, ఆకుల లవకుశ, తాహెర్ పాషా, సవరాల సత్యనారాయణ, బూర బాల సైదులు, తూడి నరసింహారావు, బొమ్మగాని శ్రీనివాస్, మీనయ్య, ముదిరెడ్డి అనిల్ రెడ్డి, కల్లేపల్లి మహేశ్వరి, సారంగుల కరుణశ్రీ పాల్గొన్నారు.