నార్కట్‌పల్లి డిసెంబర్ 7 : బీఆర్ఎస్ హయాంలో గ్రామాలు, పట్టణాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయని, రేండేళ్ల కాంగ్రెస్ పాలనలో పల్లెలు, పట్టణాలు అభివృద్ధిలో వెనుకబడిపోయాయని నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. ఆదివారం ఆయన పట్టణంలో, కొండపాక గూడెం గ్రామంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రచారం చేస్తూ సుడిగాలి పర్యటన చేశారు. వృద్ధులను, మహిళలతో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలన తీరును అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో పల్లెలు పచ్చగా ఉండేవని, నేడు ఎక్కడ చూసినా చెత్తాచెదారం నిండిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ ప్రచారం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో గ్రామాభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని అందుకు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించి కేసీఆర్‌కు బహుమతిగా ఇవ్వాలన్నారు.
రామన్నపేట, డిసెంబర్7: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తిలింగయ్య అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో సీపీఎం బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్ధి మిర్యాల మల్లేశంను గెలిపించాలని కోరుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అమలు చేయక పోవడంతో ప్రజలు గోస పడుతున్నారని అన్నారు. రైతు బంధు రాకపోవడంతో రైతుల బాధలు వర్ణనాతీతమన్నారు. సబ్బండ వర్గాల ప్రజలు తిరిగి కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ బలపరచిన అభ్యర్థులను స్థానిక ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్‌చైర్మెన్ బందెల రాములు, మాజీ ఎంపీటీసీలు వేమవరపు సుధీర్‌బాబు, గొరిగే నర్సింహ, పట్టణ అధ్యక్షుడు పోతరాజు సాయి, నాయకులు ఎస్కే చాంద్, కందుల హన్మంతు, బావండ్లపల్లి బాలరాజు, బొడ్డు అల్లయ్య, బాలగోని శివ, లవణం రాము, బాసాని రాజు, మునుకుంట్ల లెనిన్, పల్లె సత్యం, గాదే శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట, డిసెంబర్7: రాష్ట్రంలో మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. గడిచిన రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్నే గెలిపిస్తామని చెబుతున్నారని అ న్నారు. ఆదివారం మండలంలోని పెద్దకందుకూరు గ్రామంలో బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి గుండ్లపల్లి మంగమ్మ వెంకటేశ్‌గౌడ్ గెలుపును కాంక్షిస్తూ ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో పనిచేసే కార్మికులకు అండగా నిలుస్తూ వస్తున్నామన్నారు. కనివి నీ ఎరుగని రీతిలో వేతన ఒప్పందాలు చేశామని, రాబోయే 3వ వేతన ఒప్పందాన్ని సైతం చ రిత్రలో నిలిచిపోయేలా చేస్తామని హామీ ఇచ్చారు.
ఉత్సాహవంతురాలైన గుండ్లపల్లి మంగమ్మ వెంకటేశ్‌గౌడ్‌కు ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరారు. వారి హయాంలోనే గ్రామాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా, సొంత నిధులతో దుర్గామాత దేవాలయం, వాటర్ ప్లాంట్లు, తదితర వసతులు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్వల్లే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యపడిందన్నారు. 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయడం లేదన్నారు. ఉచిత బస్సు ప్రయాణాన్ని తీసుకొచ్చి మహిళలను నానా ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ఒక్కో మహిళకు రూ. 2,500 భృతి, కల్యాణలక్ష్మి, తులం బంగారం, మహిళలకు స్కూటీలు అంటూ మోసపూరిత హామీలు ఇచ్చిన రేవంత్‌రెడ్డి స ర్కార్‌కు ఎన్నికల్లో సమాధానం ఇవ్వాలన్నారు. సర్పంచ్ అభ్యర్థి గుండ్లపల్లి మంగమ్మ, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు గుండ్లపల్లి వెంకటేశ్‌గౌడ్, గ్రామ అధ్యక్షుడు సీస రమేశ్, మాజీ ఉప సర్పంచ్ మచ్చ లక్ష్మీనారాయణ, పాల సంఘం చైర్మన్ గుండ్లపల్లి కుమార్, విద్యాకమిటీ చైర్మన్ గుండ్లపల్లి శారద, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు గుర్రం మహేందర్, సీనియర్ మచ్చ ముత్యాలు, వట్టిపల్లి రాజు, యూత్ అధ్యక్షుడు లింగస్వామి, బీఆర్ఎస్కేవీ ప్రదాన కార్యదర్శి బరిగె నర్సింహులు, బీఎంఎస్ ప్రధాన కార్యదర్శి నాగేందర్‌రెడ్డి పాల్గొన్నారు.